తెలంగాణ లో టీచర్స్‌కి గుడ్‌న్యూస్.. ఫైల్‌పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపటి నుంచే.. ప్రక్రియ ఇలా..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది.

తెలంగాణ లో టీచర్స్‌కి గుడ్‌న్యూస్.. ఫైల్‌పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపటి నుంచే.. ప్రక్రియ ఇలా..

teachers promotions

Updated On : July 27, 2025 / 8:54 AM IST

Telangana Govt Teachers Promotions: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది. వారికి కొద్దిరోజుల్లో పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సంబంధిత ఫైలుపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. దీంతో 3,500 మందికి ప్రయోజనం కలగనుంది. విద్యాశాఖ ఒకట్రెండు రోజుల్లో పదోన్నతుల కోసం షెడ్యూల్ జారీ చేయనుంది. జూన్ 30వ తేదీ వరకు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల 3,500 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు రానున్నాయి. మల్టీజోన్ -1, మల్టీజోన్-2 పరిధిలో సుమారు 900 గెజిటెడ్ హెచ్ఎం, 600 పీఎస్ హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటితోపాటు మరో 2వేల వరకూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులనూ పదోన్నతులతో నింపనున్నారు.

2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మల్టీజోన్ పరిధిలోని హెచ్ఎం బదిలీలు, ఆ పోస్టులకు ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు జరిగాయి. ఆ తరువాత కోర్టు కేసులతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. 2024 జూన్, జులై నెలల్లో మల్టీజోన్-2 పరిధిలోని హెచ్ఎం పోస్టులతోపాటు మిగిలిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన గెజిటెడ్ హెచ్ఎం పోస్టుల భర్తీకి ప్రమోషన్లు ఇవ్వాలని ఇటీవల సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.

ప్రమోషన్ల ప్రక్రియ ఇలా..
రెండ్రోజుల్లో ఉపాధ్యాయ ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వనున్నారు. ముందుగా జీహెచ్ఎం సీనియార్టీ లిస్టులను మల్టీజోన్ల వారీగా ప్రకటిస్తారు. వీరికి వీటిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే స్వీకరించి, ఫైనల్ సీనియార్టీ లిస్టును రిలీజ్ చేస్తారు. ఆ తరువాత వెకెన్సీలు చూపించి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. అనంతరం స్కూళ్ల అలాట్ మెంట్ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్, పీఎస్‌హెచ్ఎం, పీడీ తదితర పోస్టులన్నింటికీ ఇదే విధానాన్ని అనుసరిస్తారు.