రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. బ్యాంక్ అకౌంట్లలో ఎప్పుడు జమ అవుతాయంటే..?

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.

రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. బ్యాంక్ అకౌంట్లలో ఎప్పుడు జమ అవుతాయంటే..?

Raitu Bharosa funds

Updated On : June 3, 2025 / 9:01 AM IST

Rythu Bharosa: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీయేటా ఎకరానికి రూ. 12వేలను రెండు దఫాలుగా అందజేస్తుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే, ఈ ఏడాది నుంచి ఒకేసారి రూ.12వేలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 70లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా.. ఇందుకోసం రూ.15వేల కోట్లకుపైగా నిధులు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది.

 

ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్ డేట్ ఇచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జరిగిన వేడుకల్లో తుమ్మల పాల్గొని మాట్లాడారు. గత ఐదేళ్లు రైతు సంక్షేమ పథకాలు మట్టిపాలయ్యాయని, అన్ని వ్యవస్థలు, సంస్థలను అప్పుల్లోకి నెట్టివెళ్లిపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చుతూ, వ్యవస్థలను చక్కదిద్దుతూ రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎగ్గొట్టిన రైతు బంధును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.7,600 కోట్లు చెల్లించామని తుమ్మల తెలిపారు.

 

ఈ సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను వరినాట్లు వేసే నాటికి అందజేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే, జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో రైతు భరోసా నిధులు విడతల వారిగా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తెలంగాణలో దాదాపు 70లక్షల మందికి రైతు భరోసా సాయం అందుతోంది. ఎకరానికి రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో రూ.12వేలు పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకే విడతలో పెట్టుబడి సాయం మొత్తాన్ని అందజేయాలంటే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. కనీసం రూ.15వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంతమొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలాగే రెండు విడుతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా.. ఒకేసారి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.