తెలంగాణలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెంచిన సర్కారు!

తెలంగాణలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెంచిన సర్కారు!

Updated On : December 29, 2020 / 8:29 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక ఇచ్చింది తెలంగాణ సర్కారు. నూతన సంవత్సరం కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్టెడ్ ఉద్యోగులు, రోజువారీ కూలీ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా జీతాలను పెంపు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో అందరూ కలిసి 9లక్షల 36వేల 976 మంది ఉండగా.. అందరికీ జీతాలు పెంపు వర్తిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులు ఆర్టీసీలో కూడా ఉన్నారని, వారికి కూడా జీతాలను పెంచాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే జీతాల పెంపు వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.