Gossip Garage: ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక పక్కానా? అక్క, లేకపోతే తమ్ముడిని బరిలో దించే ప్లాన్ లో బీఆర్ఎస్..

2018లో ఆమె బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. 2022 జూన్‌లో కారు దిగి హస్తం గూటికి చేరిన,,

Gossip Garage: ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక పక్కానా? అక్క, లేకపోతే తమ్ముడిని బరిలో దించే ప్లాన్ లో బీఆర్ఎస్..

Updated On : November 19, 2025 / 12:29 AM IST

Gossip Garage: జూబ్లీహిల్స్ చేజారిపోయింది. గ్రేటర్‌లో మరో బైఎలక్షన్‌ రాబోతోంది. ఈ సారి మాత్రం తగ్గేదేలే. గెలిచి తీరాల్సిందే. బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పుడు ఇదే పట్టుదలతో ఉందట. ఫిరాయింపు కేసులో దానం నాగేందర్‌పై వేటు పడుతుందని, ఉప ఎన్నిక వస్తుందని నమ్ముతున్న గులాబీ పార్టీ..బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. ఖైరతాబాద్‌లో పీజేఆర్‌ బ్రాండ్‌తో మైలేజ్‌ పొందే స్కెచ్ వేస్తోందట. అయితే అక్క, లేకపోతే తమ్ముడిని బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారట గులాబీ దళపతి కేసీఆర్.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ పాలిటిక్స్‌ను పీక్ లెవల్‌కు తీసుకెళ్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నువ్వా నేనా అన్నట్లుగా తలపడగా..చివరకు అధికార పార్టీకి విజయం సొంతమైంది. జూబ్లీహిల్స్ రిజల్ట్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న బీఆర్ఎస్‌ పార్టీకి..నిరాశే మిగిలింది. ఇంతలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో డెవలప్‌మెంట్స్‌ వస్తుండంటం కారు పార్టీలో కదనోత్సాహన్ని నింపుతున్నాయి. దానం నాగేందర్‌పై వేటు పడటమో..ఆయన రిజైన్ చేయడమో ఖాయం..ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక రావడం కూడా పక్కా అని.. బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది.

ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థి కోసం వేట..

అధికార కాంగ్రెస్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రస్టార్ క్యాంపెయినర్స్‌ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరును చేర్చిందన్న టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌ బైఎలక్షన్‌ కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోందట కారు పార్టీ. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశతో ఉన్న బీఆర్ఎస్‌..ఖైరతాబాద్‌లో కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటినుంచే బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ పార్టీ.

జూబ్లీహిల్స్‌లో పీజేఆర్‌ బ్రాండ్‌ను తెర మీదకు తెచ్చి..అంతో ఇంతో మైలేజ్ పొందే స్కెచ్‌ వేసింది బీఆర్ఎస్. ఖైరతాబాద్‌ పీజేఆర్‌కు కంచుకోటగా ఉండేది. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు. ఖైరతాబాద్‌లో పీజేఆర్ అభిమానులు బాగానే ఉన్నారు. అందుకే పీజేఆర్ పేరుతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగే స్కెచ్ వేస్తోందట. పీజేఆర్ వారసులైన విష్ణవర్ధన్‌రెడ్డి, విజయారెడ్డిలలో ఎవరినో ఒకరిని ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేయించే యోచనలో ఉందట బీఆర్ఎస్.

బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి.. టికెట్ ఇచ్చే ఛాన్స్?

పీజేఆర్ కూతురు విజయారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్‌ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కారు పార్టీ లెక్కలు వేసుకుంటుందట. తండ్రి పీజేఆర్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2009లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు విజయారెడ్డి. ఆ తర్వాత 2014లో ఖైరతాబాద్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా..2014 ఆగస్ట్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇక 2016, 2019లో రెండుసార్లు ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా గెలిచింది. 2018లో ఆమె బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. 2022 జూన్‌లో కారు దిగి హస్తం గూటికి చేరిన విజయారెడ్డి..గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పారీ ఫిరాయింపు కేసులో వేటు పడినా, అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసినా..కాంగ్రెస్‌ నుంచి మళ్లీ దానమే పోటీ చేసే అవకాశాలున్నాయి. అందుకే విజయారెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి..పీజేఆర్‌ బ్రాండ్‌తో మైలేజ్‌ పొందే స్కెచ్ వేస్తోందట గులాబీ పార్టీ.

ఒకవేళ విజయారెడ్డి కాంగ్రెస్‌ను వీడి రాకపోతే పీజేఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణానంతరం రెండుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు..ఆ తర్వాత 2014, 2018లో రెండుసార్లు ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్‌లో చేరారు. మొన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విష్ణు టికెట్ ఆశించినా..మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే బరిలోకి దించారు గులాబీ బాస్. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విష్ణును పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

పీజేఆర్ తనయుడిగా ఆయనకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని..ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు గట్టి పోటీ ఇస్తాడని భావిస్తోందట కారు పార్టీ. ఖైరతాబాద్ బైఎలక్షన్‌ వస్తే అక్క విజయారెడ్డి..తమ్ముడు విష్ణువర్ధన్‌రెడ్డిలలో కారు స్టీరింగ్‌ తిప్పేదెవరనేది ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఇదే గనుక జరిగి స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ నుంచి తిరిగి కడియం పోటీ చేయనుండగా..బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పుడే రాజయ్య బీఆర్ఎస్ నుంచి ప్రచారం కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: స్థానిక ఎన్నికల వేళ.. రేవంత్‌ సర్కార్‌కు కొత్త టెన్షన్..! కాంగ్రెస్ ఎలా గట్టెక్కబోతోంది?