Gossip Garage: నిన్నటి వరకు డైలాగ్‌ వార్, ఇప్పుడు క్రెడిట్‌ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. అసలు బనచకర్ల క్రెడిట్ ఎవరిది?

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వాదిస్తున్నాయి.

Gossip Garage: నిన్నటి వరకు డైలాగ్‌ వార్, ఇప్పుడు క్రెడిట్‌ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. అసలు బనచకర్ల క్రెడిట్ ఎవరిది?

Updated On : July 3, 2025 / 12:39 AM IST

Gossip Garage: నిన్నటి వరకు ఆ పాపం మీదంటే మీదని దుమ్మెత్తిపోసుకున్నారు. ఇప్పడు ఆ క్రెడిట్ మాదంటే మాదని పోటీ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ గడ్డ మీద హైవోల్డేజ్‌ పాలిటిక్స్ నడుస్తున్నాయ్. రేవంత్‌ చేతగాని తనం వల్లే బనకచర్ల పనులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అంటే..కేసీఆర్‌ చేసిన పాపం వల్లే బనకచర్లకు పునాది పడిందని రేవంత్‌ అటాక్‌ చేశారు. ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్విరాన్‌మెంటల్‌ పర్మిషన్స్‌ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టును ఆపింది తామంటే..తామని పోటీపడుతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. అసలు బనచకర్ల క్రెడిట్ ఎవరిది?

ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై..తెలంగాణ ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్ నడుస్తున్నాయ్. బనకచర్ల ప్రాజెక్టుపై మొన్నటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య డైలాగ్‌ వార్ నడిచింది. బనకచర్ల ప్రాజెక్టు పాపం మీదంటే మీదని ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. బనకచర్లకు ఆజ్యం పోసింది అప్పటి సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ వాదిస్తే.. చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డు చెప్పడం లేదని బీఆర్ఎస్ అటాక్ చేసింది.

ఇంతలోనే బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్రం ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తిట్టి దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నో చెప్పిన అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవాలని పోటీ పడుతున్నాయి. ఈ క్రెడిట్‌ వార్‌లో భాగంగా మాటకు, మాట.. విమర్శకు ప్రతి విమర్శతో తెలంగాణ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వాదిస్తున్నాయి. బనకచర్లపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు..ఇది బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల పోరాట విజయమన్నారు. తెలంగాణ జలాలపై ఏపీ చేస్తున్న కుట్రలకు ఇదో చెంపపెట్టులాంటిదని, ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీశ్‌ స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఆ ముగ్గురు Rల గురించి పార్టీలో ఎందుకంత చర్చ..

ఇదే సమయంలో బనకచర్లకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము బనకచర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టి బలంగా తీసుకెళ్లామని, అందుకే బనకచర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని ఉత్తమ్ చెబుతున్నారు.

ఇదే సమయంలో బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడం హర్షణీయమంటున్న ఎమ్మెల్సీ కవిత..ఇది తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ సాధించిన విజయమన్నారు. ఇలా బనకచర్ల ప్రాజెక్టుపై గతంలో ఆ పాపం మీదంటే మీదని ఆరోపించుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. ఇప్పుడు కేంద్రం అడ్డు చెప్పగానే ఆ క్రెడిట్ తమదంటే తమదేనని వాదించుకుంటున్నాయి.

నిజానికి బనకచర్లపై బీఆర్ఎస్ మొదట వాయిస్ రేజ్ చేసింది. ఆ ప్రాజెక్టును ఆపకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని..గోదావరిలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నష్టపోతామని ప్రెస్‌మీట్లు పెట్టి గళం వినిపించారు కారు పార్టీ కీలక నేతలు. ఆ తర్వాత సీఎం రేవంత్‌ ఆల్‌ పార్టీ ఎంపీస్‌ మీటింగ్‌ నిర్వహించి..కేసీఆర్, బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. అంతేకాదు సీఎం రేవంత్‌, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌..కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని, అధికారులను కలిసి..బనకచర్లపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఆ తర్వాత ఏపీ సర్కార్ ప్రాజెక్టు ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించింది కేంద్రం.

దీంతో బనకచర్ల ప్రాజెక్టు ఆపిన క్రెడిట్‌ ఎవరిదంటే..ఇప్పుడు అది ఒడవని ముచ్చటగా చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ సీఎంలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చర్చల తర్వాతే బనకచర్ల భవితవ్యం ఏంటో తేలనుంది.