పార్టీ మారినా సేమ్ సీన్..! కేకే వారసురాలికి ఎంత కష్టం..!

గతంలో బీఆర్ఎస్ లో ఉన్న మేయర్... అప్పటి ప్రభుత్వం తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని రెండున్నరేళ్లు గడిపేశారని.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో చేరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ తీరు మారే పరిస్థితులు కనపించడం లేదనే టాక్ నడుస్తోంది.

పార్టీ మారినా సేమ్ సీన్..! కేకే వారసురాలికి ఎంత కష్టం..!

Updated On : July 13, 2024 / 11:17 PM IST

Gossip Garage : రాష్ట్రంలోనే కీలక స్థానంలో ఉన్న ఆ ప్రజాప్రతినిధికి కష్టాలు కామన్‌గా మారిపోయాయట… టీవీ సీరియల్ ట్రాజెడీ సీన్స్ మాదిరిగా ఆ మహిళా ప్రజాప్రతినిధి సమస్యలతోనే సహవాసం చేయాల్సి వస్తోందంటున్నారు. కోటి జనాభాకు పెద్ద దిక్కైనా… తనపై పెద్దరికం చేసేవారు ఎక్కువైపోవడమే ఆ ప్రజాప్రతినిధి దురదృష్టమంటున్నారు. అదృష్టం మారుతుందని పార్టీ మారినా… కొత్త పార్టీలోనూ సేమ్ సీన్… ఏ రాయి అయితే ఏంటి తలపగలగొట్టుకోడానికి… ఎక్కడైనా అవే ప్రాబ్లమ్స్ అంటూ నిట్టూరుస్తున్నారు సదరు ప్రజాప్రతినిధి… తాను ఏ పక్షంలో ఉన్నా, విపక్షమే బలంగా ఉండటం ఆ మహిళా నేతకు మైనస్‌గా మారిందా? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న నేత ఎవరు?

పాలనపై పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు..
తెలంగాణలో మోస్ట్ పవవర్‌ఫుల్ పదవి… మోస్ట్ గ్లామరస్ పదవి అంటూ ఏదైనా ఉందంటే అది.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవే… హైదరాబాద్ మేయర్‌కు ఉండే పవర్ అట్లాంటిట్లాంది కాదు. కోట్ల రూపాయల టర్నోవర్. వేల మంది ఉద్యోగులు, కోట్లాది జనాభాకు సేవ చేసే అవకాశం మేయర్ పదవికి ఉంటుంది. అలాంటి పదవిలో ఉన్న ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి… తన పదవితో సంతృప్తి చెందలేకపోతున్నారంటున్నారు. సీనియర్ నేత కేకే కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన విజయలక్ష్మి గ్రేటర్ మేయర్‌గా మూడేళ్ల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఇప్పటివరకు పాలనలో తన మార్క్‌ చూపలేకపోతున్నారు. బాధ్యతలు చేపట్టి మూడేళ్లైనా ఇప్పటికీ కార్పొరేషన్ పాలనపై పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మేయర్ విజయలక్ష్మి.

సాధారణ సమావేశాలు నిర్వహించడం కూడా సవాలే..
రాజకీయంగా కాకలు తీరిన కేకే వారసురాలిగా మేయర్ విజయలక్ష్మి పాలనపై తన మార్కు చూపలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మూడేళ్లుగా మేయర్‌గా ఉన్నా, ఆమె విధి నిర్వహణపై వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అంతకు ముందు మేయర్‌గా ఉన్న బొంతు రామ్మోహన్ ప్రతి పనిలోనూ తనదైన శైలిలో దూకుడు చూపేవారు. అయితే ఆ తర్వాత మేయర్‌గా వచ్చిన విజయలక్ష్మి మాత్రం కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించడం తప్ప తన మార్క్ చూపలేకపోయారు. బీఆర్ఎస్ తరఫున మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి అధికారం మారిన వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇప్పుడు సాధారణ సమావేశాలు నిర్వహించడం కూడా మేయర్‌కు సవాల్‌గా మారిపోయింది.

మేయర్ కు అన్నీ ఆటంకాలే..
ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి సమావేశ నిర్వహణకు సైతం ఆటంకాలే ఎదురౌతున్నాయి. దీంతో ప్రతివారం నిర్వహించాల్సిన స్టాండింగ్ కమిటీ, ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాలపైనా మేయర్ పెద్దగా దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంటే… ఆ ప్రతిపాదనలను సాకారం చేయాల్సిన మేయర్ కు మాత్రం అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి.

రోజురోజుకు శత్రువులను పెంచుకుంటున్నారనే టాక్..
ఈ మూడేళ్లలో ఆమె నగరంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఘటన ఒక్కటీ లేదని గతంలో కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తే… ఇప్పుడావంతు బీఆర్ఎస్, బీజేపీలు తీసుకుంటున్నాయి. కేవలం అధికారులపై ఆధారపడటం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారమవడం లేదంటున్నారు విపక్ష సభ్యులు. పైగా మేయర్ మాట్లాడే విధానం వివాదాస్పదమవుతుండటంతో రోజురోజుకు శత్రువులను పెంచుకుంటున్నారనే టాక్ ఎక్కువగా ఉంది. చివరకు కార్పొరేటర్లను సైతం ఆప్ట్రాల్ అంటూ మాట్లాడిన అంశం చర్చనీయాంశంగా మారింది

నగరాభివృద్ధికి చేసిందేమీ లేదనే విమర్శలు..
ఎప్పుడూ అధికార పార్టీలో ఉండే మేయర్… నగరాభివృద్ధికి చేసిందేమీ లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమతున్నారని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ 6 వేల 500 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. రుణాలకు వడ్డీ కింద ప్రతిరోజూ కోటిన్నర రూపాయలు చెల్లిస్తున్నారు. ఇంతటి ఆర్థిక భారంలో ఉన్న కార్పొరేషన్‌ను గట్టెక్కించాల్సిన బాధ్యతనూ మేయర్ విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి.

గతంలో బీఆర్ఎస్ లో ఉన్న మేయర్… అప్పటి ప్రభుత్వం తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని రెండున్నరేళ్లు గడిపేశారని.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో చేరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ తీరు మారే పరిస్థితులు కనపించడం లేదనే టాక్ నడుస్తోంది.

Also Read : మళ్లీ టీడీపీ గూటికి? అసలు మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎందుకు చంద్రబాబు వైపు చూస్తున్నారు?