Telangana RTA Check Posts: తెలంగాణలో చెక్‌పోస్టుల రద్దు వెనుక అంత జరిగిందా? అసలు చెక్‌పోస్టుల రద్దుకు కారణం ఏమిటి?
ఆ శాఖకు కీలకంగా ఉండే ముఖ్యమైన పోస్టుకు గడిచిన రెండేళ్లలోనే నలుగురు అధికారులు వచ్చారు.

Telangana RTA Check Posts: మూడు నెలల కింద నిర్ణయం తీసుకున్నారు. నెల కింద జీవో ఇచ్చారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా చెక్ పోస్టుల రద్దు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఏకంగా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అసలు ఆర్టీఏ చెక్ పోస్టులను ఎందుకు రద్దు చేసినట్లు? నిర్ణయం తీసుకున్న రెండు నెలల తర్వాత జీవో.. జీవో ఇచ్చాక దుకాణం సర్దేయాడానికి నెల రోజులు ఎందుకు పట్టింది? చెక్ పోస్టుల రద్దు నిర్ణయాన్ని ఇన్నాళ్లు తొక్కిపెట్టిందెవరు?
రవాణా శాఖలో అవినీతికి కేరాఫ్‌గా ఉన్న చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఎప్పుడో నిర్ణయించింది ప్రభుత్వం. ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కానీ నెలలు గడుస్తున్నా..ఆ దుకాణం ఎత్తివేసేందుకు మాత్రం ఆ శాఖ చాలా టైమ్ తీసుకుంది. ఏసీబీ రైడ్స్ చేసి అక్కడి బండారం బయటపెట్టాక..ఆగమేఘాల మీద రవాణా శాఖ పెద్దలు దుకాణం సర్దేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. లేటెస్ట్‌గా ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని 12 ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏక కాలంలో దాడులు చేశారు.
అవినీతి, అక్రమ వసూళ్లకు కేరాఫ్ చెక్ పోస్టులు..
చెక్ పోస్టుల కేంద్రంగా అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు గుర్తించారు. రేవంత్ సర్కార్ చెక్ పోస్టుల మాటున నడుస్తున్న అవినీతి బాగోతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని సరిహద్దు చెక్ పోస్టుల్లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని..అక్రమ వసూళ్లు ఎక్కువ సాగుతున్నాయని, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారి పడుతుందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ సరిగ్గా జరగడం లేదని గుర్తించింది. దీంతో అవినీతికి కేరాఫ్‌గా ఉన్న సరిహద్దు చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఈ ఏడాది జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది.
అందిన కాడికి వెనుకేసుకునే పనిలో బిజీ..
చెక్ పోస్టుల ఎత్తివేతలో అవినీతి ఒక అంశమైతే మరొకటి.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్‌పోస్టుల అవసరం దాదాపుగా తగ్గింది. కేంద్రం సూచనలతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఎప్పుడో చెక్‌పోస్టులను రద్దు చేశాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం అది ఆచరణకు నోచుకోలేదు. ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో చెక్‌పోస్టుల రద్దు ప్రతిపాదనను రవాణా శాఖ ప్రభుత్వం ముందు ఉంచింది. కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డే నేరుగా చెక్ పోస్టుల ఎత్తివేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు రెండు నెలల క్రితం జీవో జారీ అయినా అవినీతి అధికారులు ఆ జీవోను కూడా పట్టించుకోలేదట. ఎవరికి వారు అందిన కాడికి వెనుకేసుకునే పనిలో బిజీగా ఉండిపోయారట.
ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి..చెక్ పోస్టుల కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెవెళ్లింది. దీంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు..ఆగమేఘాల మీద వెంటనే అన్ని చెక్ పోస్టులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా సీఎం నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకుండా..రవాణా శాఖలోనే కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఏ శాఖలో జరగని ఉన్నతాధికారుల బదిలీలు రవాణా శాఖలో జరిగాయి.
ఆ శాఖకు కీలకంగా ఉండే ముఖ్యమైన పోస్టుకు గడిచిన రెండేళ్లలోనే నలుగురు అధికారులు వచ్చారు. జ్యోతి బుద్ధప్రకాశ్, ఇలంబర్తి, సురేంద్రమోహన్ రవాణా శాఖ కమిషర్లుగా కొద్దినెలలే పనిచేయగా రఘునందన్‌రావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ కమిషనర్లు పూర్తిగా రవాణ శాఖకే కాకుండా ఇతర శాఖలకు కీలక బాధ్యతల్లో ఉండటంతో..కొందరు అధికారుల తీరు ఆడింది ఆట పాడిందే పాటగా అన్నట్లుగా నడిచిందట. ఆ క్రమంలోనే కొందరు అధికారులు ఇన్నాళ్లు చెక్ పోస్టుల దందాను నడిపించారని అంటున్నారు. ఫైనల్‌గా ఓవర్ నైట్ చెక్ పోస్టుల రద్దుతో..ప్రభుత్వం పెద్ద డెసిషనే తీసుకున్నట్లు అయ్యింది.
Also Read: మంత్రులకే కాదు ముఖ్యమంత్రికీ తప్పని తిప్పలు..! అధికారుల తీరు సర్కార్‌కు హెడెక్‌గా మారిందా?