Cm Revanth Reddy: మంత్రులకే కాదు ముఖ్యమంత్రికీ తప్పని తిప్పలు..! అధికారుల తీరు సర్కార్‌కు హెడెక్‌గా మారిందా?
కొందరు సీనియర్ ఐఏఎస్‌లు అయితే..ఏకంగా మంత్రులను పిచ్చ లైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా..బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట.

Cm Revanth Reddy: ఎంత చెప్పినా వినరు. మంత్రుల ఆదేశాలను పట్టించుకోరు. లాస్ట్‌కు సీఎం వార్నింగ్ ఇచ్చినా తీరు మారదు. ఇది పలువురు ఉన్నతాధికారుల తీరు అని ఎప్పటినుంచో ప్రభుత్వ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సర్కార్ మార్గదర్శకాలను, ఆదేశాలను హైయ్యర్ అఫీషియల్స్ లైట్ తీసుకుంటున్నారా? సంక్షేమం, అభివృద్ధి పనుల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారా? సీనియర్ ఐఏఎస్‌లపై ఒక్కరిద్దరు మంత్రులు ఏకంగా సీఎస్‌కే ఫిర్యాదు చేశారా? ఉన్నతాధికారులపై సీఎం కోపానికి రావడం వెనుక ఆంతర్యం ఏంటి?
అసలే మంత్రులు, హస్తం లీడర్ల వార్‌తో సతమతం అవుతున్న రేవంత్ సర్కార్‌కు..అధికారుల తీరు మరింత తలనొప్పిగా మారింది. కొందరు సీనియర్ ఐఏఎస్‌ల తీరు సర్కార్ పెద్దలకు చిరాకు తెప్పిస్తుందట. సెర్ప్, ఇంటర్ మీడియట్ బోర్డు, మున్సిపల్, హౌసింగ్ బోర్డ్, ఇరిగేషన్, ఫైనాన్స్, హెల్త్ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖల మంత్రులకు, సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదట.
కొద్దిరోజుల క్రితం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, మరో ఐఏఎస్ అధికారిని కామెంట్ చేయడంతో ఆ అధికారి కొంత ఇబ్బందిపడ్డారనే టాక్ సెక్రటేరియట్‌లో వినిపిస్తోంది. ఐఏఎస్‌లు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని..ఒకరిద్దరికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి బదిలీ వేటు వేశారు. ఇదిలా ఉంటే..ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెచ్చరించారు.
చెడ్డ పేరు తేవొద్దని వార్నింగ్..
లేటెస్ట్‌గా జరిగిన ఓ సమీక్షలో అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని సీరియస్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కొంతమంది అధికారుల పనితీరులో మార్పు లేదని ఏకంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని ఆదేశించారు.
బదిలీ చేయండి మహాప్రభో అంటూ సీఎంను వేడుకుంటున్నారట..
కొందరు సీనియర్ ఐఏఎస్‌లు అయితే..ఏకంగా మంత్రులను పిచ్చ లైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా..బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట. తాము చేయాలనుకున్నది మాత్రం..చకచకా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారట. వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల తీరుతో క్యాబినెట్‌లో సగానికి పైగా మంత్రులు సఫర్ అవుతున్నారట. ఒకరిద్దరు మంత్రులు అయితే..సదరు సీనియర్ ఐఏఎస్‌లపై ఏకంగా సీఎస్‌కే కంప్లైంట్ చేశారట. మరికొందరు మంత్రులు వారిని బదిలీ చేయండి మహాప్రభో అంటూ సీఎంను వేడుకుంటున్నారట.
ఇక మరికొందరి తీరు మరోలా ఉందట. వాళ్ళు మంత్రులు చెప్తే తప్ప ఫైల్ కదలదని ఏకంగా సీఎంఓ అధికారులకు తేల్చి చెప్తున్నారట. దీంతో సీఎం పేషీ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. కొందరు అధికారులు తమదో అటానమస్ బాడీ లాగా ఫీల్ అవుతున్నారట. తమ శాఖలో తామే రాజు..తామే మంత్రి అనేలా చక్రం తిప్పుతున్నారట.
ఎక్సైజ్ శాఖలో వాలంటరీ రిటైర్మెంట్ దుమారం..
లేటెస్ట్‌గా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా తన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రిజ్వీ నిబంధనలు పాటించకుండా ఖజానాకు నష్టం చేశారంటూ సీఎస్ రామకృష్ణారావుకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టాక్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో, బ్యూరోక్రాట్స్‌లో, సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ..ప్రభుత్వ ఆదేశాలను, మంత్రి నిర్ణయాలను కూడా బేఖాతరు చేసి ఖజానాకు తీవ్ర నష్టం చేశారన్నది జూపల్లి ఆరోపణ. ఒకవేళ రిజ్వీ తప్పు చేయకపోతే వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు కోరుకుంటారని కూడా అనుమానాలు మొదలయ్యాయి.
అదే సమయంలో ఆయనను ఉద్యోగంలో నుంచి రిలీవ్ చేయొద్దని, ఆయన చేసిన అవకతవకలపై విచారణ జరిపి శిక్షించాలని మంత్రి జూపల్లి ప్రభుత్వానికి లేఖ రాసి కొత్త చర్చకు తెరలేపారు. మంత్రి జూపల్లి తన మొదటి లేఖలో రిజ్వీ ప్రభుత్వ, మంత్రి ఆదేశాలను పక్కనపెట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది. అదే సమయంలో రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం..దానిని ఆమోదించవద్దని ఆ శాఖ మంత్రి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయినా ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌కు సర్కార్ ఆమోదం కూడా తెలపడం ఇంకో విశేషం. ఇప్పుడిదే ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. దీంతో ఇక తిష్ట వేసిన ఐఏఎస్‌ల ప్రక్షాళన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రక్షాళనలో అయినా నిజాయితీకి పట్టం కడతారో.. విశ్వాసపాత్రులని అందలం ఎక్కిస్తారో చూడాలి.