పీసీసీ చీఫ్ ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకింత ఆలస్యం చేస్తోంది..
పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్‌గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడైంది.
Gossip Garage : తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి నియామకం డైలీ సీరియల్‌ను మించిన సాగదీత ఎపిసోడ్‌గా మారింది. అదిగో.. ఇదిగో అంటూ రెండు నెలలుగా నాన్చుతూనే కాలం గడిపేస్తున్నారు. ముఖ్య నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అదిగో అనౌన్స్‌మెంట్ అంటూ హంగామా చేయడమే తప్ప… ఆశావహులకు తీపికబురు చెప్పడం లేదు. ఇంతకీ పీసీసీపై పీటముడి వీడకపోడానికి కారణమేంటి? కాంగ్రెస్ అధిష్టానం అంచనాలు ఎలా ఉన్నాయి?
పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్..!
తెలంగాణ కాంగ్రెస్ రథసారథి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని కొత్త సారథి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటంతో.. పార్టీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి అభిప్రాయాలను తీసుకుంది. పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్‌గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడైంది.
మహేశ్, మధుయాష్కీ మధ్య తీవ్ర పోటీ..
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠాన్ని బీసీ సామాజికవర్గం నుంచి ఇద్దరు నేతలు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధిష్టానం తేల్చుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పీసీసీ చీఫ్ కావాలని కలలు కంటున్నారు. ఇద్దరు నేతలు తనకే పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తొలి నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఎన్.ఎస్.యూ.ఐలో పని చేసిన అనుభవాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఆర్గనైజేషన్ ఇన్‌చార్జిగా సమర్థవంతంగా పని చేస్తున్నందున తనకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మహేశ్‌కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే మైనస్..
ఇక పార్టీలో మరో సీనియర్ నేత ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సైతం పీసీసీ చీఫ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానంతోను, ఢిల్లీ పెద్దలతోను మంచి సంబంధాలు ఉండటం మధుయాష్కీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వాయిస్‌ను బలంగా వినిపించడంలో మధు యాష్కీ ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక్కటే మధు యాష్కీకి మైనస్‌గా చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్‌కు ఇటీవలే ఎమ్మెల్సీ చేసినందున, ఏ పదవీ లేని తనకు పీసీసీ చీఫ్‌గా నియమించాలని మధుయాష్కీ కోరుతున్నారు.
బంతిని మళ్లీ అధిష్టానం కోర్టులోకి నెట్టిన సీనియర్లు..
ఇలా ఇద్దరు బీసీ నేతలు పీసీసీపై గురిపెట్టడంతో అధిష్టానం డైలమాలో పడిపోయిందని చెబుతున్నారు. ఇద్దరు సీనియర్లు, సమర్థులుగా ముద్ర వేసుకోవడంతో ఎటూ తేల్చుకోలేక.. పీసీసీ సారథి ఎంపికను పెండింగ్‌లో పెట్టేస్తోంది పార్టీ అధిష్టానం. ఈ విషయంపై రాష్ట్ర పార్టీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటే… ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమకు అభ్యంతరం లేదని.. బంతిని మళ్లీ అధిష్టానం కోర్టులోకి నెట్టారట సీనియర్లు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ న్యాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
Also Read : కాంగ్రెస్‌లో కలకలం రేపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. చిన్న విషయానికే అంత సీరియస్ ఎందుకయ్యారు?
ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ..
ఇద్దరిలో ఒకర్ని పీసీసీ చీఫ్‌గా సెలక్ట్ చేసి.. మరొకరికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విధమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మొత్తానికి రెండు నెలలుగా సస్పెన్ష్ కొనసాగిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్కంఠ వీడిపోనుందని అంటున్నారు. ఇదైతే గానీ మంత్రివర్గ విస్తరణ ముందుకు పోదంటున్నాయి గాంధీభవన్ వర్గాలు…