TG Assembly: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు..

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశ పెట్టింది.

TG Assembly: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు..

Telangana Assembly Session

Updated On : March 17, 2025 / 12:47 PM IST

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. అయితే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ బిల్లును, మంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. అదేవిధంగా దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది.

 

బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే, బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారి రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వీటిలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు, ముస్లీంలకు బీసీ-ఈ కింద నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ రిజర్వేషన్లను 42శాతంకు పెంచేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.

 

సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీల మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బీసీలకు రిజర్వేషన్లు పెంచే బిల్లుపై చర్చ సజావుగా సాగేలా చూడాలని, దీనికోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టేలా మాట్లాడాలని నిర్ణయంతీసుకున్నారు. దేశంలో మొదటిసారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ఆమోదం పొందిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కలిసి రిజర్వేషన్ల పెంపు మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు.