Siddipet District : భార్య, పిల్లలను చంపేసి.. గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్‌మెన్ నరేశ్ భార్య, పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Gun Fire
Crime News : సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్‌మెన్ నరేశ్ భార్య, ఇద్దరు పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద నరేశ్ గన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఆయన చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
Also Read : Indus Hospital incident : ఇండస్ ఆస్పత్రి ప్రమాదం ఘటనలో యాజమాన్యంపై కేసు నమోదు
ఆకుల నరేశ్ కు భార్య చైతన్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ. శుక్రవారం నరేశ్ విధులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండిపోయాడు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి తననుతాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే, నరేశ్ ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడటానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు, కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
ఆకుల నరేశ్ కలెక్టర్ గన్ మెన్ గా నాలుగైదు సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఇద్దరు ముగ్గురు కలెక్టర్ల వద్ద గన్ మెన్ గా పనిచేశాడు. ఎన్నికల ముందువరకు సిద్ధిపేటలో ఇంటిని అద్దెకు తీసుకొని కుటుంబంతో నివాసం ఉండేవాడు. కొద్దిరోజుల క్రితం సొంత గ్రామంకు వచ్చి నివాసం ఉంటున్నాడు. కొంత ఆర్థిక ఇబ్బందులున్న నేపథ్యంలో అతని తండ్రి కొంత జాగా కూడా ఇచ్చాడని స్థానికులు తెలిపారు. అయినా, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే భార్య, పిల్లలను నరేశ్ హతమార్చి తననుతాను కాల్చుకొని చనిపోయినట్లు తెలిసింది. నరేశ్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతోనే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు.