Heavy Floods : గిరిజన గురుకుల పాఠశాలను చుట్టుముట్టిన వరదనీరు.. భయాందోళనకు గురైన విద్యార్థులు.. అధికారుల అప్రమత్తతతో..
Heavy Floods భారీ వర్షాల కారణంగా పాఠశాల ఆవరణలో మోకాళ్ల లోతుగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రాత్రిళ్లు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Heavy Floods
Heavy Floods : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో వర్షం బీభత్సం (Heavy Floods) సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కుండపోత వర్షం కారణంగా దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల భవనం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగు సమీపంలో పాఠశాల ఉండటంతో వరద నీరు పాఠశాల భవనాన్ని చుట్టుముట్టింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
భారీ వర్షాల కారణంగా పాఠశాల ఆవరణలో మోకాళ్ల లోతుగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రాత్రిళ్లు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా జలదిగ్భందం అయింది. బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అధికారులు బుధవార ఉదయం గిరిజన గురుకుల పాఠశాల భవనంలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వేరే ప్రాంతానికి తరలించారు.
గిరిజన గురుకుల పాఠశాల జలదిగ్భందంలో చిక్కుకోవడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 13వ తేదీన ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గిరిజన పాఠశాల భవనం జలదిగ్భదంలో చిక్కుకుంది. చుట్టూ వర్షం నీరు చేరి జలమయం అయింది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా.. మరోసారి గరుకుల పాఠశాల భవనంను వరద నీరు చుట్టుముట్టింది.
