తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?

మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?

Updated On : October 25, 2025 / 9:36 PM IST

Revanth Reddy: ఇక్కడ జరగాల్సిన రచ్చ అంత జరిగింది. వరుస పెట్టి మంత్రులు రచ్చకెక్కారు. ఈ రచ్చ అటు ఇటు తిరిగి హస్తినకు చేరింది. ఇదే టైమ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హస్తినలో పర్యటించడం చర్చకు దారి తీసింది. అయితే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పూర్తిగా పొలిటికల్ అంశాలకే పరిమితమైందట.

కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైనే ఫోకస్ పెట్టారట. పార్టీ అధిష్టాన పెద్దలతో కేవలం డీసీసీల అంశాన్ని చర్చించడానికే వెళ్లారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు.

ఏఐసీసీ నుంచి పరిశీలకులు వచ్చి డీసీసీ ఆశావహులతో ప్రత్యేకంగా భేటీ అయి.. ఒక జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాపై చర్చించేందుకు సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ నియోజకవర్గంలో జాబ్ మేళా ఉన్నందున వెళ్లలేకపోయారు. అయితే కేసీ వేణుగోపాల్తో భేటీలో మంత్రుల వివాదాలు, రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయట.

Also Read: రైలు టికెట్లు బుక్‌ చేస్తుంటే మీకూ ఈ సమస్య ఎదురవుతుందా? ఏం జరిగింది? ఏం చేయాలి?

ఈ మధ్య మంత్రుల కాంట్రవర్సీలపై ప్రస్తావనకు వచ్చాయట. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిల ఎపిసోడ్ ఆ తర్వాత కొండా సురేఖ అంశం పెద్ద రచ్చగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపాయి.

ఖర్గే అసంతృప్తి

వీటితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా ఒక ఐఏఎస్ పై సీఎస్ కు లేఖ రాయడం మరింత దుమారాన్ని రేపింది. ఇలా ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసిందట. ఈ మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పరామర్శించేందుకు.. మంత్రి దామోదర రాజనర్సింహ, కొందరు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఖర్గే.. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. వీటిపై మంత్రి దామోదర సహా ఆయనతో పాటు ఖర్గే కలిసిన ఎమ్మెల్యేలెవరూ స్పందించలేదు. దీనిపై కూడా పెద్ద దుమారమే నడిచింది.

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న విషయాలపై సీఎం, పీసీసీ, డిప్యూటీ సీఎంతో చర్చించారటకేసీ వేణుగోపాల్. ఈ సందర్భంగా పరిపాలన పరంగా మంత్రులు తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్ ఇచ్చారట. ఈ మధ్య జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రులతో జరిగిన చర్చను కూడా అధిష్టానానికి వివరించారట. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అంశాలన్నింటిపై తమకు అవగాహన ఉందని కేసీ వేణుగోపాల్ చెప్పారట.

పరిపాలన విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్‌లో వరుస పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కాస్త ఆందోళన వ్యక్తం చేసిందనే అంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా పార్టీ పెద్దలే రంగంలోకి దిగారట. హైకమాండ్ ఎంట్రీతోనైనా..పార్టీ పరిస్థితి గాడిన పడుతుందా.? మంత్రుల వార్‌కు ఎండ్ కార్డ్ పడుతుందా అనేది వేచి చూడాలి.