BC Reservations GO: బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో వాడీవేడి వాదనలు.. కోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా

ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడిస్తారని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించగా.. తాము సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్.

BC Reservations GO: బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో వాడీవేడి వాదనలు.. కోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా

Telangana High Court

Updated On : September 27, 2025 / 7:58 PM IST

BC Reservations GO: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పించే జీవోపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఇవ్వడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టు సూచించింది. ఇక, జీవో గెజిట్ కానప్పుడు ఆందోళన ఎందుకని పిటిషనర్లను జడ్జి అడిగారు.

అటు ఎన్నికలు నిర్వహించడానికి 45 రోజుల సమయం పడుతుందని కోర్టుకు ఏజీ వివరించారు. మరోవైపు 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని రాజ్యాంగం చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. బీసీలకే 42శాతం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేసు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది హైకోర్టు. అక్టోబర్ 8వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ప్రకారం కేసును విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

బీసీ రిజర్వేషన్ల జీవోపై రెడ్డి జాగృతి మాధవరెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వర్చువల్ గా ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చారని ఏజీ తెలిపారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందని ఏజీ తెలిపారు. మరో 2, 3 నెలల సమయం కావాలని అఫిడవిట్ వేయొచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది.

”అసెంబ్లీలో బీసీ బిల్లు కోసం తీర్మానం చేశాం. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది. తీర్మానం ఫైనల్ చేసే అధికారం అసెంబ్లీకి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం చూస్తోంది. గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఎన్నికలు నిర్వహించడానికి 45 రోజుల సమయం పడుతుంది” అని ఏజీ తన వాదనలు వినిపించారు.

ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడిస్తారని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించగా.. తాము సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామంది.

ఇక పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు మయూర్ రెడ్డి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సెక్షన్ 286 (a) కింద రిజర్వేషన్లు 50శాతం మించరాదని, సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ”రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లు 50శాతం మించి ఉండరాదు. సుప్రీంకోర్టు పలు తీర్పులు కూడా ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు” అని మయూర్ రెడ్డి తెలిపారు.

Also Read: మదర్‌ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎవరెవరు గెలిచారంటే?