దేశంలోనే మొట్టమొదటిది.. హైదరాబాద్‌లో ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్.. ఇక పార్కింగ్ కష్టాలు ఉండవ్..
టెర్మినల్ గేట్ వద్ద కార్డ్ స్వైప్ చేయగానే గేట్ తెరుచుకుంటుంది. వినియోగదారులు కారును టర్న్‌టేబుల్‌పై ఉంచి హ్యాండ్‌బ్రేక్ వేసి, ఇంజిన్ ఆఫ్ చేసి బయటకు రావాలి.
Multilevel parking project in Nampally (Image Credit To Original Source)
- త్వరలోనే ప్రారంభించనున్న జీహెచ్‌ఎంసీ
- భవనం మొత్తం 15 అంతస్తులు
- 10 అంతస్తులు వాహనాల పార్కింగ్‌కు
- 5 అంతస్తులు వాణిజ్య కార్యకలాపాలకు
Multilevel parking project: దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ హైదరాబాద్‌లోని నాంపల్లిలో అందుబాటులోకి వచ్చింది. ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) త్వరలోనే ప్రారంభించనుంది. 15 అంతస్తుల ఈ భవంలో 10 ఫ్లోర్లలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందులో 250 కార్లు, 150-200 ద్విచక్ర వాహనాలకు స్థలం ఉంటుంది.
మిగతా 5 అంతస్తులను వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించారు. ఇందులో 2 ఆధునిక సినిమా థియేటర్లు ఉంటాయి. 11వ అంతస్తులో నగర వీక్షణ గ్యాలరీ ఉన్నాయి. రోబోటిక్ పార్కింగ్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిఘా, సౌర విద్యుత్, విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలతో ఈ రూ.150 కోట్ల ప్రాజెక్టు రూపొందింది. నాంపల్లి రైల్వే స్టేషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఉండే పార్కింగ్ సమస్యను ఇది తగ్గించనుంది.
పీపీపీ విధానంలో ప్రాజెక్టు
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో నోవమ్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు చెందిన 2,000 చదరపు గజాల భూమిలో 50 సంవత్సరాల కన్‌సెషన్‌తో నిర్మించిన ఈ కాంప్లెక్స్, వివిధ ప్రభుత్వ శాఖల తుది అనుమతుల తర్వాత అందుబాటులోకి రానుంది.
పార్కింగ్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు
ఈ ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ వ్యవస్థ సెన్సార్ల ద్వారా పూర్తిగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ వాహనాలను స్వయంగా గుర్తించి ఎస్‌యూవీలు, సెడాన్లు, చిన్న కార్లు అని వర్గీకరిస్తుంది. నిర్దేశిత అంతస్తుల్లో పార్క్ చేస్తుంది. ఢిల్లీ, ముంబైలోని యాంత్రిక పార్కింగ్ విధానాలకు భిన్నంగా ఇది ప్యాలెట్లు లేకుండా పనిచేస్తుంది. పార్కింగ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. ప్రవేశ, నిష్క్రమణ టెర్మినళ్లను విశాలంగా రూపొందించారు. స్మార్ట్ సౌకర్యాలతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ఫ్లాట్ టర్న్‌టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఎలా పనిచేస్తుంది?
వాహనాన్ని ఏ కోణంలో ఉంచినా టర్న్‌టేబుల్ 360 డిగ్రీలు తిరిగి సరైన స్థితిలో ఉంచుతుంది. ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌కు వచ్చే సమయంలో వినియోగదారులకు క్యూ ఆర్ కోడ్ ఉన్న ప్రవేశ టికెట్ ఇస్తారు. ఆ కార్డ్ టెర్మినల్‌కు దారి చూపుతుంది.
టెర్మినల్ గేట్ వద్ద కార్డ్ స్వైప్ చేయగానే గేట్ తెరుచుకుంటుంది. వినియోగదారులు కారును టర్న్‌టేబుల్‌పై ఉంచి హ్యాండ్‌బ్రేక్ వేసి, ఇంజిన్ ఆఫ్ చేసి బయటకు రావాలి.
బయట కార్డ్ స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాహనాన్ని సిస్టమ్ స్కాన్ చేసి వర్గీకరించి స్వయంగా పార్క్ చేస్తుంది. వాహనం తిరిగి పొందేందుకు వినియోగదారుడు కౌంటర్‌లో ఫీజు చెల్లించి ఐవో టెర్మినల్ వద్ద కార్డ్ స్వైప్ చేయాలి. ఆపై వాహనం పార్కింగ్ వేదిక నుంచి తిరిగి వస్తుంది.
