Therapy Dog: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కుక్కలు.. ప్రయాణీకుల కోసం స్పెషల్ ప్రోగ్రామ్.. లాభాలు ఏంటంటే..
ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పైలట్ దశలో ఉంది. ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Therapy Dog: హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకుల కోసం కొత్త సర్వీస్ తీసుకొచ్చారు. అదే థెరపీ డాగ్స్. అసలేంటీ థెరపీ డాగ్స్? దేనికోసం? అనే వివరాల్లోకి వెళితే.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్వహిస్తున్న GMR గ్రూప్ ఈ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ప్రయాణీకుల సౌకర్యం కోసం థెరపీ డాగ్‌లను పరిచయం చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టులో కుక్కలను ఉంచుతారు. ప్రయాణికులు వాటితో కాసేపు గడపొచ్చు. కుక్కలతో సమయం గడపటం ఏంటనే సందేహం రావొచ్చు. ఇలా కుక్కలతో సమయం గడపటం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుందని, దాంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ వాతావరణం ఏర్పడుతుందని ఎయిర్ పోర్టు సిబ్బంది వెల్లడించారు.
విమానాశ్రయాన్ని నిర్వహించే GMR గ్రూప్ ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా “థెరపీ డాగ్ ప్రోగ్రామ్”ను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన నాలుగు టాయ్ పూడెల్స్ తో తొలుత ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. టాయ్ పూడెల్స్ ఒక రకమైన బ్రీడ్ కుక్కలు. ఇవి ప్రశాంతంగా ఉంటాయి. తరగా అలవాటు పడే స్వభావం కలిగి ఉంటాయి. ప్రొఫెషనల్ హ్యాండ్లర్ల పర్యవేక్షణలో టాయ్ పూడెల్స్ ని ఉంచుతారు.
ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పైలట్ దశలో ఉంది. ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశ పెట్టే అవకాశం ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ చొరవ ప్రయాణికుల్లో ప్రయాణ సంబంధిత ఆందోళనను తగ్గించగలవని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ప్రశాంతమైన విమానాశ్రయ వాతావరణాన్ని సృష్టిస్తాయని RGIA వర్గాలు తెలిపాయి.
”ఇప్పటికైతే ఈ ప్రోగ్రామ్ కి స్పందన బాగుంది. విమానాశ్రయంలో ప్రయాణీకులను స్వాగతించే ఈ ఆలోచనని ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కుక్కలను హ్యాండిల్ చేయడానికి శిక్షణ పొందిన ట్రైనర్ల టీమ్ ఎప్పుడూ వాటితో పాటు ఉంటారు. అలాగే విమానాశ్రయంలో ప్రయాణికుల భద్రతకి హామీ ఇస్తున్నారు” అని ఎయిర్ పోర్టు వర్గాలు చెప్పాయి.
ఈ కుక్కలు సర్టిఫైడ్ థెరపీ జంతువులు. ప్రశాంతమైన ప్రవర్తన కోసం శిక్షణ పొందినప్పటికీ అవి ఎల్లప్పుడూ ప్రొఫెషనల్ హ్యాండ్లర్ల పర్యవేక్షణలో ఉంటాయి. ఈ హ్యాండ్లర్లు కుక్కలను ఓ కంట కనిపెట్టుకుని ఉంటారు. అంతేకాదు ప్రయాణీకుల భద్రత కూడా వారి బాధ్యతే.
ఈ థెరపీ డాగ్స్ ప్రోగ్రామ్ గురించి ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. “నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పటికే కోలుకోవడం ప్రారంభించినట్లు అనిపిస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన చొరవ. దయచేసి అద్భుతమైన పనిని కొనసాగించండి. ఈ అద్భుతమైన ప్రయత్నానికి నిధులు సమకూర్చి, సులభతరం చేసినందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక ధన్యవాదాలు” అని అతడు తన అనుభవాన్ని పంచుకున్నాడు.
”పెంపుడు కుక్కను కలిగి ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ చొరవ ఆలోచనాత్మకంగా, హృదయపూర్వకంగా ఉంది. ఇది నిజమైన ప్రశంసలకు అర్హమైనది” అని మరో ప్రయాణీకుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రయాణీకులు ఎవరైతే ఇష్టపూర్వకంగా ముందుకు వస్తారో వారికి వద్దకు మాత్రమే డాగ్స్ ను పంపిస్తారు.
ప్రతి శుక్రవారం నుండి సోమవారం వరకు దేశీయ, అంతర్జాతీయ డిపార్చర్ ఏరియాస్ లోని కొన్ని కీలకమైన టచ్ పాయింట్లలో ఈ కుక్కలను ఉంచుతారు. ఈ 4 రోజుల్లో ప్రతిరోజూ 4 గంటలు మాత్రమే డాగ్స్ అక్కడుంటాయి.