ఎవరూ ఆందోళన చెందొద్దు, వాటి జోలికి వెళ్లం- బతుకమ్మకుంటలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్థానికులతో చెప్పారు రంగనాథ్.

Hydra Commissioner AV Ranganath
Hydra Demolitions : హైదరాబాద్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. బతుకమ్మకుంట వివరాలు అడిగి తెలుసుకున్నారాయన. ఆ ప్రాంతం మొత్తం పరిశీలించారు. బతుకుమ్మకుంట అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బతుకమ్మకుంట భూముల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో బతకుమ్మకుంట ప్రాంత వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారాయన. అలాగే కుంటను అభివృద్ధి చేస్తామని, ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్థానికులతో చెప్పారు రంగనాథ్. 5 ఎకరాలకుపైగా ఉన్న బతుకమ్మకుంట చెరువు ప్రాంతాన్ని సుందరంగా చేస్తామని రంగనాథ్ వెల్లడించారు.
”అంబర్ పేట్ చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తాం. 5 ఎకరాలకుపైగా ఉన్న స్థలాన్నంతా డెవలప్ చేస్తాం. హైడ్రా పేరుతో భయబ్రాంతులకు గురి చేయడం సరికాదు. అక్రమ కట్టడాలు, నిర్మాణాలు మినహాయిస్తే మిగతా వాటిని మేము కూల్చం. బెంగళూరు తరహాలో చెరువుల అభిృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బతుకమ్మకుంట భూముల విషయంలో కోర్టు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. బతుకమ్మకుంట అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం” అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణపై ప్రధానంగా ఫోకస్ చేశారు అధికారులు. హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చివేసినా.. ఇకపై చెరువుల అభివృద్ధిని కొనసాగిస్తామని.. బతుకుమ్మకుంటను పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికులతో మాట్లాడినప్పుడు చెప్పారు. 25 ఎకరాలకుపైగా ఉన్న చెరువు.. ఇప్పుడు ఐదున్నర ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. అక్కడ అనేక నిర్మాణాలు వెలిశాయి, అనేక మంది ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాబట్టి వాటిని కూల్చమన్నారు రంగనాథ్. అక్కడ మిగిలిపోయిన భూమిని మాత్రం పరిరక్షిస్తామన్నారు.
కోర్టుల్లో పిటిషన్లు వేసిన వారంతా ఓడిపోయారని, అది ప్రభుత్వ భూమిగా డిక్లేర్ అయ్యిందని, చెరువు స్థలంగా డిక్లేర్ అయిందని, కాబట్టి దాన్నంతా డెవలప్ చేస్తామని స్థానికులతో చెప్పారు రంగనాథ్. అందులో వెలసిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించాలని ఆదేశించారు రంగనాథ్. అదే విధంగా చెరువులో ఉన్న శిథిలాలను తొలగించాలన్నారు.
గతంలో ఆ ప్రాంతాన్ని అంతా జీహెచ్ఎంసీ డంపింగ్ కేంద్రంగా వాడింది. అక్కడ ఉన్న చెత్తను కూడా తొలగించాలన్నారు. చెట్లు, చెత్త చెదారం తొలగించి చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. పై నుంచి వచ్చే వరద నీటి కాల్వలను కూడా పునరుద్ధరించాలని అధికారులతో చెప్పారు రంగనాథ్. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు చెరువు పరిశీనలో పాల్గొన్నారు. చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ మూడు విభాగాల అధికారులను ఆదేశించారు రంగనాథ్.
Also Read : ఆ నలుగురిలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యేదెవరు?