హైడ్రా కొరడా.. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Hydra Demolitions
Hydra Demolitions : అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు హైడ్రా వెంటనే యాక్షన్ లోకి దిగిపోతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. సర్వే నెంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ, సొసైటీ ప్రతినిధులు మున్సిపాలటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఈ ఫిర్యాదును మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో.. సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.
ఇటీవల కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హైడ్రా యాక్షన్ పై కాలనీ సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
”రోడ్డు మీద కట్టడాలు ఆపాలని కోర్టును ఆశ్రయించాం. దాదాపు 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. చెప్పాల్సిన వారందరికీ చెప్పాం. మున్సిపల్ అధికారులకు చెప్పాం. కట్టే వాళ్లకి చెప్పాం. మేము రిక్వెస్ట్ చేస్తే కొందరు కట్టడం ఆపేశారు. కొందరు మాత్రం వినలేదు. మొండిగా నిర్మాణాలు చేశారు. దీని గురించి మున్సిపల్ అధికారులను అడిగా. ఎందుకు మీరు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని ప్రశ్నించా.
అక్రమ కట్టడాల ద్వారా కాలనీ వాసులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారితో చెప్పా. దయచేసి మీరు అడ్డుకోవాలని కోరా. మేము చెప్పినా కూడా వారు వినడం లేదు, మీరిక కోర్టుకు వెళ్లండి అని మున్సిపల్ అధికారులు కూడా చేతులెత్తేశారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో మున్సిపల్ అధికారులు వచ్చి చెక్ చేశారు. అన్ని రకాల అనుమతులు ఇచ్చారు. ఇదేమిటి అని మున్సిపల్ అధికారులను అడిగితే.. మా తప్పేమీ లేదన్నట్లుగా వాళ్లు మాట్లాడారు” అని వందనపురి కాలనీ సొసైటీ సభ్యుడు రుద్రపాటి లింగమయ్య తెలిపారు.
Also Read : యువకుల్లారా.. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్