తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరేనా? రెండ్రోజుల్లో గుడ్‌న్యూస్?

ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌ ఇంకా ఒక‌ట్రెండు రోజులైనా స‌రే అక్కడే ఉండి అన్ని స‌మీక‌ర‌ణాల‌ను సెట్ చేసుకొని వ‌స్తార‌ట‌.

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరేనా? రెండ్రోజుల్లో గుడ్‌న్యూస్?

CM Revanth Reddy

Updated On : May 27, 2025 / 2:56 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏడాదిన్నరగా ఊరిస్తున్న క్యాబినెట్ విస్తర‌ణ‌, ఎనిమిది నెల‌లుగా ఆశలు రేపుతోన్న పార్టీ క‌మిటీల‌ నియామకానికి ఈ సారి ముహూర్తం ఫిక్సయ్యేలా ఉంది. ఎన్నోసార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం కొలిక్కి తీసుకొస్తుందంటున్నారు నేతలు.

సీఎం, పీసీసీ చీఫ్‌తో పాటు ఒక ముఖ్యనేత ప్రయత్నం వ‌ల్లే అది సాధ్యం అవుతుందనే టాక్ గాంధీభ‌వ‌న్‌లో వినిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఒక శ‌ప‌థం చేశార‌ట‌. అందుకే క‌మిటీలు, క్యాబినెట్ విస్తర‌ణ కొలిక్కి రాబోతుందని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు.

మంత్రివర్గ విస్తర‌ణ‌కు, పార్టీ క‌మిటీల నియామకం విష‌యంలో చాలా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. సామాజిక స‌మీక‌ర‌ణాలు కుద‌ర‌క‌..ముఖ్యనేత‌ల పంథాలు, ప‌ట్టింపుల‌తో కొలిక్కిరాలేదు. ప‌లుసార్లు ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు అధిష్టానం ప్రయ‌త్నించినా ఫలించలేదు.

ఈ మ‌ధ్య జరిగిన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ముఖ్యనేత‌ల‌ను ఢిల్లీకి పిలిపించుకొని అధిష్టానం మాట్లాడినా మంత్రివర్గ విస్తరణకు, పీసీసీ పదవుల భర్తీకి గ్రహణం వీడలేదు. దాంతో ఇక ఇప్పట్లో క్యాబినెట్ విస్తర‌ణ సాధ్యం కాద‌ని అంతా చేతులెత్తేశారు. కానీ మీనాక్షి నటరాజన్‌ చేసిన శ‌ప‌థం కార‌ణంగా చిక్కుముడుల‌న్నీ వీడుతూ.. ఒక్కొక్కటిగా కొలిక్కి వ‌స్తున్నాయ‌ట‌.

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు చికాకు? 
క్యాబినెట్ విస్తర‌ణ‌, రాష్ట్ర పార్టీ క‌మిటీ భర్తీ విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ చాలా సీరియ‌స్‌గా తీసుకున్నార‌ట‌. ఆమె హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా ఆశావ‌హులంతా ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ మ‌ధ్య ఏఐసీసీ ఇచ్చిన పిలుపు జై బాపు, జై భీమ్ కార్యక్రమం విజ‌య‌వంతం కోసం మీనాక్షి నటరాజన్ నిర్వహించిన స‌మావేశాల్లో కూడా ఈ టాఫిక్‌ డిస్కషన్‌కు వ‌చ్చిందట‌. దీంతో మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు చికాకు వ‌చ్చేసిందంటున్నారు.

ఇక క్యాబినెట్ విస్తర‌ణ‌, పార్టీ క‌మిటీలు వేసే వ‌ర‌కు హైద‌రాబాద్‌లో అడుగుపెట్టేది లేద‌ని డిసైడ్ అయ్యారట మీనాక్షి న‌ట‌రాజ‌న్‌. అందుకే దాదాపు నెల రోజులకుపైగా అవుతున్నా ఆమె తెలంగాణ వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదంటున్నారు. పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఇదే విష‌యాన్ని స్పష్టం చేశారట మీనాక్షి నటరాజన్. పార్టీ క‌మిటీలు, క్యాబినెట్‌ విస్తర‌ణ పూర్తి చేయాల్సిందేన‌ని..లేకపోతే తాను ప‌నిచేయ‌లేన‌ని హైక‌మాండ్‌కు వివ‌రించారట మీనాక్షి నటరాజన్. దీంతో అధిష్టానం ఈ సారి ఎట్టి ప‌రిస్థితిలో అంతా సెట్ చేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంద‌ట‌.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి శ‌ప‌థం కార‌ణంగా క్యాబినెట్ విస్తర‌ణ‌, పార్టీ క‌మిటీల‌ నియామకానికి ఏర్పడిన గ్రహ‌ణం వీడ‌నున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌ ఇంకా ఒక‌ట్రెండు రోజులైనా స‌రే అక్కడే ఉండి అన్ని స‌మీక‌ర‌ణాల‌ను సెట్ చేసుకొని వ‌స్తార‌ట‌. జూన్ 2 లోపు..ఈ నెలాఖ‌రున మంత్రివర్గ విస్తరణ‌, పీసీసీ పదవుల భర్తీ ఉండబోతుందని గాంధీభ‌వ‌న్‌ వ‌ర్గాల టాక్. ఈ సారైనా క్యాబినెట్‌ విస్తరణకు లైన్ క్లియర్‌ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.