Journalists Arrest: జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన జగ్గారెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్

వారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు కోసం పిలిపించి ఉండొచ్చన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Journalists Arrest: జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన జగ్గారెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్

Ktr Harish Jagga Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 6:09 PM IST
  • జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం
  • జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరం
  • వెంటనే వారిని విడుదల చేయాలి

Journalists Arrest: ఓ టీవీ చానల్ కు సంబంధించి ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి అర్ధరాత్రి అరెస్టులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు సంయమనం పాటించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అరెస్టులు భయానక పరిస్థితులకు దారితీస్తాయన్నారు. అధికారులకు న్యాయం జరగడంతో పాటు మళ్లీ ఇలాంటివి జరక్కుండా చూడాలని జగ్గారెడ్డి అన్నారు.

లేనిది ఉన్నట్లుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే. దాన్ని అందరం తీవ్రంగా ఖండించాల్సిందే. ప్రభుత్వం దీనిపై ఒక కమిటీ వేసింది. కమిటీ కూడా అర్థరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయడం.. ముందు విచారణ చేయండి. నిజాలు ఏంటి, అబద్దాలు ఏంటి తెలుసుకోండి. ఎందుకిలా జరిగిందో అధికారులు ఎంక్వైరీ చేయాలి. పిలిపించి విచారణ చేయండి. కానీ అర్థరాత్రి పూట వెళ్లి ఎక్కడ పడితే అక్కడ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఒక భయంకరమైన వాతావరణానికి ఇది దారితీస్తుంది. కస్టడీలో ఉన్న వారిని వదిలేయాలి. నోటీసులు ఇచ్చి విచారించాలి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి.

పాలన చేతకాని ప్రభుత్వం పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో జర్నలిస్టులను బలి చేస్తారా? అని ప్రశ్నించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? అని నిలదీశారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు.

జర్నలిస్టులను నేరస్తుల లాగా చూడటం దురదృష్టకరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు కోసం పిలిపించి ఉండొచ్చన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి అరెస్టులతో జర్నలిస్టులను, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు.

 

 

Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. పానీ యాప్ వచ్చేస్తోంది.. నీటిని వృథా చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సిందే!