నన్ను క్షమించండి- కాంగ్రెస్‌లో చేరికపై ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో తన చేరికపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చన్న సంజయ్ కుమార్.. అందరితో..

నన్ను క్షమించండి- కాంగ్రెస్‌లో చేరికపై ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు

Mla Sanjay Kumar : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. పార్టీ మార్పు వ్యవహారంపై ఆడియో రిలీజ్ చేశారు. పార్టీకి దూరమవుతున్నందుకు తనను క్షమించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన కోరారు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించానని తెలిపారు. మంత్రులు కూడా సహకారం అందిస్తానని చెప్పినట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తనతో ఉండొచ్చని తెలిపారు. కాంగ్రెస్ లో తన చేరికపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చన్న సంజయ్ కుమార్.. అందరితో చర్చించాకే పార్టీ మారినట్లు వివరించారు.

Also Read : కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా? రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబు

”బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నా నమస్కారం. మీ అందరి సహకారంతోనే నేను ఎమ్మెల్యేగా గెలిచాను. జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పని చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలామంది పలుమార్లు వ్యక్తం చేశారు. ఇందులో భిన్నాభిప్రాయాలు కూడా ఉండొచ్చు. పార్టీకి దూరమవుతున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను క్షమించాలి. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారు” అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

Also Read : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం: షబ్బీర్ అలీ

కాగా, సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. సంజయ్ కుమార్ చేరిక పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందారు. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా తలపడ్డారు. అలాంటిది.. తనతో మాట మాత్రమైన చెప్పకుండానే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.