Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ చరిత్రలో కొత్త రికార్డ్..! ఉపఎన్నిక బరిలో 58మంది అభ్యర్థులు..
నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను వెల్లడిస్తారు.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగిసింది. మొత్తం 81 మంది నామినేషన్ వేశారు. వీరిలో ఇవాళ 23మంది విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను వెల్లడిస్తారు.
నిన్నటివరకు చెల్లుబాటు అయ్యే నామినేషన్లు 81 ఉన్నాయి. అందులో 23 మంది ఇవాళ తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో పోటీలో 58మంది ఉన్నారు. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందిన వారికి వాళ్లకు సంబంధించిన గుర్తులు కేటాయించారు. ఇండిపెండెంట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తులను ఫైనల్ చేస్తారు. ఏ గుర్తు కావాలంటే దాన్ని వారికి కేటాయించే అవకాశం ఉంది.
రేపటి నుంచి ప్రచారం జోరందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఎన్నికల గుర్తులు వచ్చాక చిన్న పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు సైతం ప్రచారానికి వెళ్లనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇక్కడ గెలిచి తీరాలనే కసితో అధికార కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. గోపీనాథ్ భార్య సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఓట్లను కురిపిస్తాయనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ బీసీలకు టిక్కెట్ కేటాయించింది. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్.. గెలుపుపై ధీమాగా ఉన్నాయి. తాము కూడా సత్తా చాటుతామని బీజేపీ అంటోంది. 2023 ఎన్నికల్లో దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.
Also Read: తెలంగాణలో చెక్‌పోస్టుల రద్దు వెనుక అంత జరిగిందా? అసలు చెక్‌పోస్టుల రద్దుకు కారణం ఏమిటి?
