Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ బైపోల్.. పోలింగ్ వేళ ఆందోళనలు, ఉద్రిక్తతలు.. ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే..
బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పులు పంచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16శాతం పోలింగ్ నమోదైంది. కాగా, పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేసుకున్నాయి.
అటు కృష్ణానగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలింగ్ బూత్ దగ్గర మాగంటి సునీత ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
షేక్ పేట్ డివిజన్ లో ఓట్ల రిగ్గింగ్ కలకలం రేపింది. పోలింగ్ బూత్ నెంబర్ 67లో రిగ్గింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఒకరి ఓటు మరొకరు వేశారంటూ గందరగోళం నెలకొంది. అసలైన ఓటర్ కంటే ముందే మరొకరు ఓటు వేసేశారు. తన ఓటును తనకంటే ముందే మరొకరు వేశారని ఓ మహిళా ఓటర్ వాపోయారు. దీంతో ఆమె ఆందోళనకు దిగింది.
అటు షేక్ పేట్ డివిజన్ లోని కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఆందోళన నెలకొంది. బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పులు పంచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 120 వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక నేతలు వెంగళరావు నగర్ లోని పోలింగ్ బూత్ 120 వద్ద డబ్బులు పంచారని స్థానికులు ఆరోపించారు. డబ్బులు పంచుతున్న వారిని స్థానికులంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.
అటు బోరబండ పోలింగ్ బూత్ లో ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేయటం ఉద్రిక్తతకు కారణమైంది. పోలింగ్ ఏజెంట్లు టేబుల్ పెట్టుకోకుండా అడ్డుకుని బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీకి పోలీసులు అండగా నిలుస్తున్నారని సునీత ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినా, బెదిరించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అటు బోరబండలోని బూలింగ్ బూత్ వద్దకు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు.. పార్టీ గుర్తు ఉన్న టీషర్ట్స్ వేసుకుని వచ్చారు. వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని నిలదీశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పార్టీ గుర్తు ఉన్న టీషర్ట్స్ ఎలా వేసుకొస్తారని నిలదీశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది ఆ పార్టీనే..! తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్..
