Telangana Congress: రాహుల్‌తో జూపల్లి, పొంగులేటి భేటీకి సమయం ఫిక్స్.. రేవంత్ సహా ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు

పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.

Telangana Congress: రాహుల్‌తో జూపల్లి, పొంగులేటి భేటీకి సమయం ఫిక్స్.. రేవంత్ సహా ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు

Jupalli and Ponguleti

Telangana Congress: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో వీరు భేటీ కానున్నారు. వీరి భేటీ సమయం ఫిక్స్ అయింది. 26న (సోమవారం) ఉదయం 11గంటలకు ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ అవుతారు. ఈ భేటీలో జూపల్లి బృందం పది మంది, పొంగులేటి బృందం 40మంది ఉంటారని తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం కొంత మంది, రేపు ఉదయం మరికొందరు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రాహుల్‌తో భేటీ తరువాత పొంగులేటి, జూపల్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతోపాటు కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Rahul Gandhi : ఆ రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం,కాంగ్రెస్ గెలుపు పక్కా : రాహుల్ గాంధీ

పొంగులేటి, జూపల్లి ఇద్దరూ రాహుల్ గాంధీతో భేటీ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. వీరి భేటీలో ఖమ్మం, పాలమూరులో సభలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపైనా స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సభలో రాహుల్ పాల్గొంటారా, ప్రియాంక గాంధీ పాల్గొంటారా? అనే విషయం తేలాల్సి ఉంది. మరోవైపు పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో ఒకేరోజు సభలు నిర్వహించాలా, వేరువేరు రోజుల్లో సభల నిర్వహణ ద్వారా చేరికలు ఉంటాయా అనే విషయంపైనా పొంగులేటి, జూపల్లి రాహుల్ తో భేటీ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Minister Amit shah: అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు.. కారణమేమంటే?

పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర పార్టీలోని కీలక నేతలతో పాటు, ఖమ్మం, పాలమూరు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. వీరందరితో రాహుల్ భేటీ అవుతారని, కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకురావాలని సూచనలు చేస్తారని తెలుస్తోంది. కొత్త పాత నేతలను పార్టీ అధిష్టానం సమన్వయం చేయనున్నట్లు సమాచారం. అంతేకాక, రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై సీనియర్లతో రాహుల్ గాంధీ చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.