కేసీఆర్ సహా హరీశ్ రావు, ఈటలకు చేరిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. వారి తేదీల్లో మార్పు.. విచారణకు హాజరవుతారా..?
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.

KCR, Harish Rao
Kaleshwaram Enquiry Commission Notice to KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే. తాజాగా.. కమిషన్ నోటీసులు వారికి చేరాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు.
కమిషన్ ముందు హాజరు కావలసిన ఈటల, హరీశ్ రావు తేదీలలో మార్పు చేశారు. ముందు నిర్ణయించిన ప్రకారం.. జూన్ 6వ తేదీన హరీశ్ రావు, 9వ తేదీన ఈటలకు రావాలని ఆదేశించగా.. తాజాగా.. జూన్ 6వ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీశ్ రావు విచారణకు హాజరవ్వాలని కమిషన్ పేర్కొంది. కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే, కమిషన్ విచారణకు కేసీఆర్, హరీశ్ రావులు హాజరవుతారా..? అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ నోటీసులు జారీ చేసిన తరువాత.. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి హరీశ్ రావు వెళ్లారు. కేసీఆర్ తో తాజా పరిస్థితులపై ఆయన చర్చించినట్లు తెలిసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. కమిషన్ విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలిసింది. వారి సూచనల మేరకు విచారణకు హాజరుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. హరీశ్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.