కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత
200 యూనిట్లలోపు కరెంటు వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని.. కాబట్టి ప్రజలు బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

kalvakuntla kavitha
Kalvakuntla Kavitha: అభయ హస్తం 6 గ్యారంటీల పథకాల అమల కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన దరఖాస్తులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఉన్న రేషన్ కార్డులకే పథకాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎక్స్ (ట్విటర్)లో ఆక్షేపించారు. కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
200 యూనిట్లలోపు కరెంటు వాడకానికి బిల్లు కట్టొద్దని తెలంగాణ ప్రజలను కవిత కోరారు. బిల్లు కట్టనవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు అందుతున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ హామీయిచ్చినట్టుగా పెన్షన్లు తీసుకుంటున్న 44 లక్షల మందికి జనవరి 1 నుంచి 4 వేలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధు డబ్బు ఇంకా ఎందుకు జమ చేయలేదు? నిరుద్యోగ భృతికి దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదన్నది కూడా ప్రభుత్వం చెప్పాలన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘ప్రజా పాలన’.. బీఆర్ఎస్ స్వేద పత్రంపై రేవంత్ ఘాటు రియాక్షన్