Bandi Sanjay : స్వార్థ రాజకీయాల కోసం.. కేసీఆర్ ప్రజలనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేస్తారు : బండి సంజయ్
చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు.

Bandi Sanjay Fire KCR
Bandi Sanjay Fire KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇంకెన్నాళ్లీ మోసాలు అంటూ మండిపడ్డారు. పాలమూరును దత్తత తీసుకుంటానని ప్రకటించి ఆ జిల్లా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కరీంనగర్ ను డల్లాస్, న్యూయర్క్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని మోసం చేసినట్లు విమర్శించారు. గజ్వేల్ ను నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తానని హామీలిచ్చి వాళ్ళను మోసం చేశారని తెలిపారు.
ఇప్పుడు ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కామారెడ్డి అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకోవడంలో అభ్యంతరం లేదని.. మరి మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు. రాజన్న ఆలయానికి నయాపైసా ఇవ్వకుండా రాజన్నకు భక్తులు సమర్పించిన కానుకల నుండి కామారెడ్డికి నిధులు మళ్ళించాలనుకోవడం దుర్మార్గం అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ప్రజలనే కాదు, చివరికి సాక్షాత్తు దేవుళ్ళను కూడా మోసం చేస్తారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని అన్నారు.