కేసీఆర్ విచారణకు బయలుదేరిన వేళ కీలక పరిణామాలు.. కేసీఆర్‌ను కలిసిన కవిత.. ప్రభుత్వంపై కేటీఆర్ కామెంట్స్‌

ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు.

కేసీఆర్ విచారణకు బయలుదేరిన వేళ కీలక పరిణామాలు.. కేసీఆర్‌ను కలిసిన కవిత.. ప్రభుత్వంపై కేటీఆర్ కామెంట్స్‌

KCR

Updated On : June 11, 2025 / 10:40 AM IST

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకావడానికి మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. కేసీఆర్‌కు ఆమె లేఖ రాసిన తర్వాత మొదటిసారి ఆమె ఫాంహౌస్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో ఆమె వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.

కేసీఆర్ వెంట హైదరాబాద్ బయలు దేరిన వారిలో బీఆర్ఎస్‌ నేతలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ కవిత, తదితరులు ఉన్నారు.

మరోవైపు, మరికాసేపట్లో ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్ కు కేటీఆర్ రానున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

Also Read: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో 2 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

“కేసీఆర్‌ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం” అని అన్నారు.

జారిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. ఆయనను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. తుంటి ఎముకలో గాయం అయినట్లు తెలుస్తోంది.

బీఆర్కే భవన్ వద్ద ఆంక్షలు
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్కే భవన్‌లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కు వచ్చే వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు నేపధ్యంలో పోలీసుల ఈ ఆంక్షలు విధించారు.