నాడు.. నేడు.. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఫైర్
కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదని చెప్పారు.

KCR
కశ్మీర్‌లో ఉగ్రవాదులు మన దేశ ప్రజలపై దాడి చేశారని, వారికి నివాళులు అర్పిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఉగ్రదాడిలో అమాయక ప్రజలు చనిపోయారని చెప్పారు. బీఆర్ఎస్ రజోత్సవ సభకు తరలివచ్చిన వారందరికీ వందనాలు తెలుపుతున్నానని అన్నారు.
కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదని కేసీఆర్ చెప్పారు. వలసవాదుల వల్ల నలిగిపోతున్న తన భూమికి విముక్తి కల్పించాలని భావించానని, తెలంగాణకు విముక్తి కలిగిచేందుకు ఒక్కడినే బయలుదేరానని తెలిపారు. అప్పట్లో తన గరించి కొందరు వెటకారంగా మాట్లాడారని అన్నారు.
ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని కేసీఆర్ చెప్పారు. మన నడిగడ్డలో అసెంబ్లీలో నిలబడి చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్ని నిషేధించారని తెలిపారు.
అలాగే, నాడైనా, నేడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. అనేక మంది బలిదానాలు, త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని చెప్పారు.
తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రతో జవహర్‌లార్ నెహ్రూ కలిపారని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణిచివేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మలిదశ ఉద్యమం ఉద్ధృతమైందని తెలిపారు.