Telangana Budget 2025: వారికి మూటలు పంపే బడ్జెట్ ఇది: కేటీఆర్, హరీశ్ రావు

రాష్ట్రం దివాళా తీసిందా? కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ పోయిందా అన్న విషయం అర్థం కావడం లేదని చెప్పారు.

Telangana Budget 2025: వారికి మూటలు పంపే బడ్జెట్ ఇది: కేటీఆర్, హరీశ్ రావు

Updated On : March 19, 2025 / 4:46 PM IST

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అని కేటీఆర్ అన్నారు.

ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచారని చెప్పారు. 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారని అన్నారు. ఇది అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ అని, ఇది 40% కమీషన్ల కాంగ్రెస్ బడ్జెట్ అని చెప్పారు.

ప్రజాధనాన్ని పార్టీ పంచిపెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే మిగిలిందన్నారు. ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జెట్ అని చెప్పారు.

ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అందమే సక్కగా లేదని, అందాల పోటీలు పెట్టేందుకు ఈ సర్కారు సిద్ధమవుతోందని అన్నారు.

“రంకెలు కాదు రేవంత్ రెడ్డి.. అంకెలు ఎక్కడ పోయినై? ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్‌ది. ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలు గోవిందా, పాతర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావించలేదు. తుల బంగారం దిక్కు లేదు. చేనేతకు మా హయాంలో 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తే.. ఇవాళ చేనేత కార్మికులకు 300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పరిమితం చేశారు” అని అన్నారు.

ఏం అడిగితే అది ఇస్తామని అన్నారుగా?: హరీశ్ రావు
ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ బడ్జెట్ లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవని చెప్పారు. ఎన్నికల ముందు అన్నీ చేస్తాం, అధికారంలోకి రాగానే ఏమీ చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉందని తెలిపారు. భట్టి ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని అన్నారు.

ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. వడ్డీ లేని రుణం ఇస్తున్నామని మోసం చేశారని తెలిపారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మహిళలను దారుణంగా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. బడ్జెట్లో పేజీలు పెరిగాయని, పేదల సంక్షేమం మాత్రం పెరగలేదని అన్నారు.

బడ్జెట్ అరచేతిలో వైకుంఠం చూపిన మాదిరి ఉన్నదని అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందా? కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ పోయిందా అన్న విషయం అర్థం కావడం లేదని చెప్పారు. ఎక్సైజ్ ద్వారా 50 వేల కోట్ల రూపాయలు ఆశించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 15 నెలల్లోనే ఎఫ్ఆర్‌బీఎం అప్పులు రెండింతలు ఎక్కవ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు బీసీలను దగా చేసిందని అన్నారు. అంకెల గారెడితో ఈ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని చెప్పారు.