అచ్చంపేట దాడి ఘటనపై స్పందించిన కేటీఆర్.. రాహుల్ గాంధీకి ట్వీట్

నాగ‌ర్‌క‌ర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

అచ్చంపేట దాడి ఘటనపై స్పందించిన కేటీఆర్.. రాహుల్ గాంధీకి ట్వీట్

KTR on Achampet Attack: లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అచ్చంపేటలో చోటుచేసుకున్న దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. యాహీ హై క్యా ఆప్కీ “మొహబ్బత్ కీ దుకాన్” అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విటర్ లో ట్యాగ్ చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరారు. ”ప్రత్యర్థులపై దాడి, అధికార దుర్వినియోగంలో పోలీసుల భాగం కావడం సిగ్గుచేటు. దాడికి కారణమైన ఈ గూండాలను, ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకుంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామ”ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ (electronic gadget) పట్టుకొని చోద్యం చూస్తున్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అంటూ మాజీ ఐపీఎస్ అధికారి, నాగ‌ర్‌క‌ర్నూల్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్విటర్ లో ఆరోపించారు. అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి అంటూ ఆ ఘటనకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్ రెడ్డి

అచ్చంపేటలో అసలేం జరిగింది?
నాగ‌ర్‌క‌ర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. పోలీసులు అక్కడే ఉన్నా వారిని వారించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ బాలరాజు ఇంటి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు.

 

Also Read: కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది, మాకే ఎక్కువ సీట్లు వస్తాయి- లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్