Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్, సోషల్ మీడియాలో జీవో వైరల్… నిజం ఏంటంటే..

Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్, సోషల్ మీడియాలో జీవో వైరల్… నిజం ఏంటంటే..

Telangana Lockdown

Updated On : April 2, 2021 / 7:25 AM IST

Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ఏకంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ కానీ నైట్ కర్ఫ్యూ కానీ.. విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొందరపడి లాక్ డౌన్ విధించే ఉద్దేశం తమకు లేదన్నారు. దీంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

పాక్షిక లాక్ డౌన్(నైట్ కర్ఫ్యూ) అమలు:
ఇంతలోనే మళ్లీ కలకలం రేగింది. మరోసారి లాక్ డౌన్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఏప్రిల్ 1న లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్(నైట్ కర్ఫ్యూ) అమలు చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సా. 6 నుంచి ఉ. 8 వరకు షాపులు, వ్యాపార సముదాయాలు, ప్లే జోన్లు మూసి ఉంచాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి.

ప్రభుత్వం పేరుతో జీవో:
ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసినట్టుగా ఉన్న ఓ జీవో బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని అందులో ఉంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వార్త వైరల్ అయింది. ఈ జీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంతకం ఉండటంతో అంతా నిజమే అని నమ్మేశారు.

లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లేదు.. అది ఫేక్ జీవో..
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ ప్రచారంలో నిజం లేదన్నారు. అది ఫేక్ జీవో అని స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి రకమైన లాక్ డౌన్ విధించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని మరోసారి స్పష్టంచేశారు. షాపులు, వాణిజ్య సంస్థలు మూసివేయాలంటూ 2021 ఏప్రిల్ 1న తన సంతకంతో జారీ చేసిన జీవో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇదీ నకిలీదని.. ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల పేరుతో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మొద్దని సోమేష్ కుమార్ కోరారు. నా పేరుతో జీవో ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

తెలంగాణలో కరోనా విలయతాండవం:
తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 337 మంది కోలుకోగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేల 551 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,166 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో 684 కేసులు నమోదు కాగా.. గురువారం నాటి బులెటిన్‌లో ఆ సంఖ్య 887కి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాల జిల్లాలో 56 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది. ఇప్పటి వరకు 3,01,564 మంది కోలుకోగా.. 1,701 మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒకే రోజు 59,297 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు అంటున్నారు. భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ప్రచారం చేస్తున్నా కూడా వారిలో మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.