One tree two colors :ఒక చెట్టుకు రెండు రంగులు..ఏప్రిల్ లో మాత్రమే కనిపించే వింత

One tree two colors :ఒక చెట్టుకు రెండు రంగులు..ఏప్రిల్ లో మాత్రమే కనిపించే వింత

One Tree Two Colors

Updated On : April 12, 2021 / 5:28 PM IST

One tree two colors : ప్రకృతి తల్లి ఒడిలో ఎన్ని వింతలో ఎన్నెన్ని కవ్వింతలో. అందాల ప్రకృతిలో వింతలకు ఏమాత్రం కొదువ లేదు. చూసే కొద్దీ వింతలు, విచిత్రాలు విస్తుగొలుపుతుంటాయి. ప్రకృతి అంటేనే రంగుల నిలయం. ఒక్కోరంగూ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని అలరిస్తుంది. ప్రకృతి అంటేనే పచ్చదనం. పచ్చని ఆకులు ఒక్కో దశలో ఒక్కోరంగుతో కనువిందు చేస్తాయి. చెట్లు చిగురించినప్పుడు చిలకపచ్చ రంగులో ఉండే ఆకులు తరువాత ముదురు ఆకుపచ్చని రంగులోకి మారిపోతాయి. ఆ తరువాత అవి ఎండిపోయినప్పుడు మరో రంగు. ఇలా ఒక్క ఆకులోనే పలు రంగులుగా మారిపోతాయి. ఈ ఆకులు మనుషుల జీవితాలను ప్రతిబింభిస్తాయి. మనిషికి బాల్యం, యవ్వనం, వృద్యాప్యం ఎలాగో చెట్టుకు ఆకులకూడా అలాగే. చిగురించినప్పుడు బాల్యంగా చిరుగాకుపచ్చలా నిగనిగలాడుతుంటాయి. తరువాత మనిషి జీవితంలో యవ్వనంలాగా ముదురు రంగులో మెరిసిపోతాయి. ఆ తరువాత వృద్ధాప్యంలాగా ఆకులు పండిపోయి రాలిపోతాయి. అందుకే మనిషి కూడా పండుటాకులాగా రాలిపోతారని అంటుంటారు.

ప్రకృతిలో కొన్ని చెట్లు మాత్రం ప్రత్యేకతలకు కలిగి ఉంటాయి. అటువంటి చెట్లల్లో ఒకే చెట్టుకు రెండు రంగుల్లో కూడా ఆకులు ఉంటాయి. కానీ ఒకే చెట్టుకు ఒకవైపు ఆకు పచ్చగాను..మరోవైపు ఎర్రటి రంగులో కనిపించి అలరిస్తుంటుంది. తెలంగాణాలోని అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ వింత చెట్టు చూపరుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చెట్టు అన్ని రోజుల్లోను ఇలా రెండు రంగుల్లో ఉండదు. కేవలం ఏప్రిల్ నెలలో పూత పూసే సమయంలో మాత్రమే ఇలా రెండు రంగుల్లో కనిపించి కనువిందు చేస్తుంది. రెండు రంగుల్లో కనిపించే ఈ చెట్టు ప్రకృతి చేస్తున్న మాయంలో ఒకటి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హీరాపూర్ గ్రామ సమీపంలో ఓ ఇప్పచెట్టు ఉంది. ఈ చెట్టు కొన్నేళ్లుగా పూత పూసే పమయంలో రెండు రంగులుగా మారుతుంది. కాస్త దూరం నుంచి చూస్తే ఈ చెట్టు రెండు చెట్లుగా కనిపిస్తుంది. కానీ దగ్గరకెళ్లి చూస్తే మాత్రం ఒకేచెట్టు. పూత పూసే సమయంలో రెండు రంగులుగా అంటే ఒకవైపు ఆకుపచ్చ రంగు..మరోవైపు ఎర్రటి రంగులో మెరిసిపోయే ఈ చెట్టు పూత సమయం పూర్తి అయితే మాత్రం ఒకేరంగులోకి మారిపోవటం ఈ ‘ఇప్పచెట్టు’ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ చెట్టును ప్రభుత్వం సంరక్షించాలని కోరుతున్నారు. అలాగే ఈ చెట్టు విశేషాలను గిన్నీస్ బుక్ లోకి ఎక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెండు రంగుల్లో కనిపించే ఈ చెట్టును చూడటానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. పూలు పూసే సమయంలో రంగులు మారే ఈ చెట్టుని చూడటానికి స్థానికులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు తరలివస్తుంటారు.

ఆదివాసీలకు ప్రకృతి తల్లి ప్రసాదించిన చెట్టు ఇప్ప చెట్టు, ఈ ఇప్పచెట్టు పూలను అడవిబిడ్డలు సేకరించి అమ్ముకుంటుంటారు. ఈ పువ్వులతో కాసే సారాయికి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఇప్ప పూలను పలు ఔషధాల్లో వాడతారు. అలాగే ఇప్పపువ్వులతో లడ్డూలు…పలు రకాల స్వీట్లు తయారుచేస్తుంటారు. ఈ ఇప్పపూలతో తయారు చేసిన లడ్డూలు తింటే రక్తహీనత సమస్య తీరిపోతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పపువ్వులతో చేసిన లడ్డూలను పంపిణీ చేయాలని యోచిస్తోంది.