వైద్య సిబ్బంది నిర్లక్ష్యం…బస్టాండ్ లో గర్భిణీ ప్రసవం

జనగామ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బస్టాండ్ లో గర్భిణీ ప్రసవించింది. నిన్న జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ఓ నిండు గర్భిణీ మాతా శిశు ఆస్పత్రికి రాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఇక్కడ వైద్యం చేయడం కుదరదని బయటికి పంపించారు. దీంతో నొప్పులు తట్టుకోలేని ఆ మహిళ ఆస్పత్రి ముందుగల బస్టాండ్ లో ప్రసవించింది.
బస్టాండ్ లో గర్భిణీ ప్రసవించిన ఘటనపై సూపరింటెండెంట్ సీరియస్ అయ్యారు. గర్భిణీ ఆస్పత్రికి వచ్చిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ తోపాటు 10 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వైద్యుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట, కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు.