Weather Update : బిగ్ అలర్ట్.. వామ్మో.. ఈ టైం దాటిన తరువాత బయటకు రాకండి.. హెచ్చరికలు జారీ.. గతంలో ఎప్పుడూ లేనిస్థాయిలో..
Weather Update : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వచ్చే వారం రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
summer temperatures
- తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు
- రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- వచ్చే వారంరోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత
Weather Update : తెలంగాణలో భానుడు ఉగ్రరూపందాల్చుతున్నాడు. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం వేళల్లో ఎండల వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే భానుడి ప్రతాపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, వచ్చే వారం రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : Telangana Govt : రైతులకోసం రేవంత్ సర్కార్ మరో కొత్త కార్యక్రమం.. ఉపయోగాలివే.. అంతా గ్రామాల్లోనే..
తెలంగాణలో ప్రస్తుతం 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజులు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రికార్డు స్థాయిలో 45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటవచ్చునని అంచనా వేసింది. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 9 దాటిందంటే రోడ్లపై రాకపోకలు తగ్గిపోతున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్లు సైతం వెలవెలబోతున్నాయి. ఎండ తాకిడిని తట్టుకోలేక వ్యాపారులుసైతం దుకాణ సముదాయాలను మూసేస్తున్నారు.
రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్గొండ, అదిలాబాద్, భద్రాద్రి, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. హైదరాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అదిలాబాద్. అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్, అలాగే పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులుంటేనే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే ఎండ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలని, ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేపుళ్లు, మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యుల హెచ్చరిస్తున్నారు.
