Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు..

Telangana Rains ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు..

Telangana Rains

Updated On : September 24, 2025 / 6:49 AM IST

Telangana Rains : తెలంగాణలో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోనూ వానలు దంచికొడుతుండటంతో నగర వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకపక్క వర్షాలు దంచికొడుతుండగా.. తాజాగా.. మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Smita Sabharwal: హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్..

బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈనెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 25వ తేదీన ఏర్పడే అల్పపీడనం 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని.. ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

అక్టోబర్ 26వ తేదీన జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అక్టోబర్ 27వ తేదీన సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, అదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు.. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నగరంలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.