Duddilla Sridhar Babu : వాటిపై దర్యాప్తు చేస్తాం, కచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం- మంత్రి శ్రీధర్ బాబు
ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోరుకున్నారో వాటిని అమలు చేస్తాం. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తాం

Duddilla Sridhar Babu
ఆరు నూరైనా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చామన్నారాయన. ఇక, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేపడతామని మా మేనిఫెస్టోలోనే పెట్టామన్నారు. మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు చేస్తామని నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన మంథని వెళ్తున్న శ్రీధర్ బాబుకు కరీంగనర్ బైపాస్ లో కరీంనగర్ కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం పలికారు.
”ఉచిత బస్సుతో పాటు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. వారి మాట ఒకటి, చేతలు మరొకటిగా ఉంటాయి. తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ తో చెట్టా పట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు బీజేపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? బీజేపీ వాళ్లు రాజకీయ అంశాన్ని ముందుకు తెచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : శంషాబాద్ లో దోపిడి దొంగల బీభత్సం.. వాహనం ఆపి కత్తులతో బెదిరించి 1,50,000 నగదు ఎత్తుకెళ్లారు
ఉమ్మడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా అధిక స్థానాల్లో ప్రజలు పట్టం కట్టారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోరుకున్నారో వాటిని అమలు చేస్తాం. గడిచిన పదేళ్లు లక్ష్యాలు చేరుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తాం” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
”దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపేలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. మా ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ప్రజలకు మేలు చేసేవి ఉంటే వాటి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. వ్యవసాయ, ఉపాధి, పరిశ్రమ, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండే కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తాం. ప్రణాళికబద్దంగా రాబోయే బడ్జెట్ లో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించాలని ఆలోచన చేస్తున్నాం” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.