మరో ఐదేళ్లుకూడా రేవంత్ రెడ్డే సీఎం.. మళ్లీమళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. మరో ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Minister Komatireddy Venkat Reddy
Minister Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని బీజేపీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవిత్ర రంజాన్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్ ఈద్గా వద్ద ప్రార్థనలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. భారతదేశంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారని, బీజేపీ రాజకీయ ప్రయోజనాలకోసం మతం పేరుతో విభజన చేస్తుందని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్గొండ ఎంపీగా పోటీచేస్తున్న కందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు.
Also Read : అప్పుడే ఖమ్మంలో పోటీ చేయాలనుకున్నా: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
మరో ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం..
బీజేపీ నేత మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని చెబుతున్నారు. ఏక్ నాథ్ షిండేను తయారు చేసిందే బీజేపీ. ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. మరో ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పారు. పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేయాలి.. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని మంత్రి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
Also Read : ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
ముందు మీ పార్టీలో చక్కదిద్దుకోండి..
బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఎవరూ లేరు. బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల గురించి మహేశ్వర్ రెడ్డి మాట్లాడాలి. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మహేశ్వర్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని మంత్రి వెంకట్ రెడ్డి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటుకూడా రాదు.. ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నా దేనికైనా సిద్ధం అంటూ మంత్రి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.