ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పొసగడం లేదా.?
దీంతో పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగేదెట్లా అనేది అసలు సిసలు కాంగ్రెస్ వాదులు ప్రశ్న.

Minister Ponnam Prabhakar
కరీంనగర్ హెడ్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ క్యాడర్ విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తోందట. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం క్యాడర్ అనాధగా మారిందనే విమర్శలు ఉన్నాయ్. మంత్రి పొన్నం ప్రభాకర్ తీరే అందుకు కారణమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమళ్ల శ్రీనివాస్ కూడా పొన్నంతో గిట్టకే పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారని అంటున్నారు.
పొన్నం తీరు నచ్చక విమర్శలు చేసినందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటున్నారు. అయినా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాల టూర్‌లో కనిపించడం చర్చకు దారి తీసింది. అయితే పురమళ్ల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దక్కే లేకుండా పోయారట.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరం!
ఇప్పటి వరకు కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కూడా వేయలేదంటున్నారు లోకల్ లీడర్లు. ఇళ్లు మంజూరు కాక.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారానికి నోచుకోక కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు. పొన్నం మంత్రిగా ఉన్నా ఆయన లోకల్ లీడర్లు, క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదట.
కొత్తగా ఏర్పడ్డ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, మానకొండూరు, చొప్పదండితో పాటు హుజురాబాద్, హుస్నాబాద్‌లో కొన్ని మండలాలు ఉంటాయి. అయితే మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు..మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్యాప్ ఉందట. శ్రీధర్‌బాబు, పొన్నం అభ్యంతరం చెప్పడం వల్లే తనకు అమాత్య యోగం దక్కలేదని ఆయన కోపంగా ఉన్నారట. ఇక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అయితే బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండిసంజయ్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారట.
Also Read: కవిత వల్ల ఇద్దరు సీఎంలు ఓడిపోయారు.. ఒక సీఎం జైలుకి వెళ్లారు: మల్లు రవి
ఆయనకు కూడా పొన్నంతో సఖ్యత లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్లీలోని కాంగ్రెస్ క్యాడర్‌కు ఎవరి దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదట. జిల్లా కేంద్ర నియోజకవర్గమైన కరీంనగర్‌కు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే లేనిలోటు తీర్చేవారే లేరని అసంతృప్తితో ఉన్నారట క్యాడర్, లీడర్లు. సుడా ఛైర్మన్‌గా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నా ఆయన మంత్రి పొన్నం వ్యతిరేక శిబిరానికి చెందిన వ్యక్తిగా ముద్రపడ్డారట.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశంకు కూడా మంత్రితో సఖ్యత లేదట. దీంతో ఈ ఇద్దరికి దగ్గరికి వెళ్తే మంత్రి పొన్నంకు ఆగ్రహం కలుగుతుందేమోనని క్యాడర్ ఎటూ తోచని ఆగమ్యగోచర పరిస్థితిలో ఉన్నారట. ఇక శ్రీధర్ బాబు వర్గీయులు పొన్నంను..పొన్నం ప్రభాకర్ వర్గీయులు శ్రీధర్ బాబును కలుపుకుని పోయే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగేదెట్లా అనేది అసలు సిసలు కాంగ్రెస్ వాదులు ప్రశ్న. కరీంనగర్‌లో అస్తవ్యస్తంగా మారిన పార్టీ వ్యవహారాలపై అధిష్టానంతో పాటు ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడితే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గుకురాలేమంటున్నారు లోకల్ లీడర్లు. పార్టీలో ఇంటర్నల్ క్లాషెస్‌కు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని..లేకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి కష్టకాలమేనని హెచ్చరిస్తున్నారు సొంత పార్టీ లీడర్లు.