హరీశ్ రావు, ఈటల అబద్ధాలు చెప్పారు… నిజాలు ఇవే…: మంత్రి తుమ్మల
ఈటల వ్యాఖ్యల తర్వాత తనకు బాధ, కొంత అనుమానం కలిగాయని తెలిపారు.

Minister Thummala
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మండిపడ్డారు. ఇవాళ తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడుతూ… హరీశ్ రావు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. మూడేళ్ల తర్వాత రివైజ్ ఎస్టిమేట్ మాత్రమే క్యాబినెట్ ముందుకు వచ్చాయని, అసలు డీపీఆర్ క్యాబినెట్‌కు రాలేదని చెప్పారు. నాటి సబ్ కమిటీకి, కాళేశ్వరానికి సంబంధం లేదని తెలిపారు.
ఈటల రాజేందర్ తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలని తుమ్మల అన్నారు. కమిషన్ ముందు ఈటల అసత్యాలు ఎందుకు చెప్పారని నిలదీశారు. ఈటల ఆనాలోచితంగా వాంగ్మూలం ఇచ్చారా లేదంటే అలాంటి పరిస్థితులు వచ్చాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ ఎన్నడూ నివేదిక ఇవ్వలేదని, వివరాలన్నింటినీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
Also Read: రూ.10 వేలకే 50MP కెమెరా ఫోన్ కావాలా? 8 బెస్ట్ 5G మొబైల్స్ ఇవే… ఫీచర్లు కెవ్వుకేక…
తాను సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తానని తెలిపారు. దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం లాంటి పెండింగ్ ప్రాజెక్టులపై సబ్జెక్ట్, ప్రాజెక్ట్ వైజ్‌గా కమిటీ రిపోర్ట్ గా ఇచ్చామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో మాత్రమే కాళేశ్వరం పనులు జరిగాయని అన్నారు. తప్పుడు వార్తల ద్వారా తనను బాధ్యుడిని చేయడం సరికాదని తెలిపారు.
తాను నిజాయితీ, నిబద్ధతతో రాజకీయల్లో ఉన్నానని తుమ్మల అన్నారు. ఈటల వ్యాఖ్యల తర్వాత తనకు బాధ, కొంత అనుమానం కలిగాయని తెలిపారు. ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఈటలకు ఎందుకు వచ్చిందని అడిగారు. రాజకీయాలు వేరు.. రాష్ట్ర అభివృద్ధి వేరని చెప్పారు. నాడు తాను ప్రజలు, రైతులకు మేలుజరిగే సూచనలు చేశానని తెలిపారు.