కేసీఆర్ అప్పులపాలు చేసినా.. హామీలు అమలు చేస్తున్నాం- మహేశ్ కుమార్ గౌడ్

పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.

కేసీఆర్ అప్పులపాలు చేసినా.. హామీలు అమలు చేస్తున్నాం- మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud : బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. పదేళ్ల కాలంలో రైతులకు ఏం చేశారని ధర్నా చేస్తున్నారని నిలదీశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మోకరిల్లిందంటూ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోదీల మధ్య ఫెవికాల్ బంధం ఉందన్నారు. ఇటు కరీంనగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ సైతం బీఆర్ఎస్ శ్రేణులను తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని వెలిచాల రాజేందర్ ఆరోపించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, చిప్ప చేతికి ఇచ్చి వెళ్లారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రైతులకు తీపి కబురు అందజేస్తారని తెలిపారు.

హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ”బీఆర్ఎస్ నాయకులు వరి ధాన్యం విషయంలో ధర్నాలు చేస్తున్నారు. సిగ్గు అనిపించడం లేదా..? పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులతో ఎలా ప్రవర్తించారో చూశాం. ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. పంట నష్టపోతే రైతులను పరామర్శించ లేదు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. ఆయన ఫాం హౌస్ లో వరి వేసుకోలేదా..?

రైతులకు పదేళ్లలో బాసటగా నిలవలేదు. గత ప్రభుత్వం కన్నా ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిలోనే ఐకేపీ సెంటర్లు తెరిచింది. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చే ప్రభుత్వం మాది కాదు. ప్రజలు ఈ 4 నెలల పాలనలో సంతోషంగా ఉన్నారు. రైతులకు రేవంత్ రెడ్డి త్వరలో తీపి కబురు అందజేస్తారు. కేసీఆర్ అప్పులతో.. చిప్ప చేతికి ఇచ్చి వెళ్లినా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తుడుచు పెట్టుకుపోయింది. అందుకే ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు.

కేసీఆర్ హయాంలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. పదేళ్లలో తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నాయకులు ఆలోచించాలి. ధర్నాలు చేసేది రైతులు కాదు.. బీఆర్ఎస్ నేతలు. త్వరలోనే కొత్త పీసీసీని ఏఐసీసీ నియమిస్తుంది. ఎవరికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను కూడా పీసీసీ రేస్ లో వున్నా. సామాజిక వర్గంతో సంబంధం లేదు. సమర్థవంతులకు పీసీసీ పదవి దక్కుతుంది. ఆర్గనైజషన్ పై అనుభవం, సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుంది” అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Also Read : ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం