Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్‌లో ఆరు ప్లాట్‌ఫామ్స్ మూసివేత.. ఇక రైళ్ల రాకపోకలు అన్నీ అక్కడి నుంచే..
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆరు ప్లాట్ ఫామ్స్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Secunderabad Railway Station
South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆరు ప్లాట్ ఫామ్స్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాదు.. వచ్చే 115రోజుల పాటు 120 జతల రైళ్లు వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో ఎక్కువగా రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా.. కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చేసింది. దాని స్థానంలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. అయితే, ఆధునికీకరణ పనుల నిమిత్తం ఈ స్టేషన్లో ఆరు ఫ్లాట్ ఫామ్స్ మూసివేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పున:నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో వచ్చే 115 రోజులుపాటు సగం ప్లాట్ ఫామ్స్ ను మూసివేయనున్నారు. రైల్వే స్టేషన్ పున: నిర్మాణంలో రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఇదే కీలక భాగం. ఇది 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది.
భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. పునాదులు, కాలమ్స్ పనులు మొదలు పెడుతున్నారు. ఇందుకోసం 2-3, 4-5 ప్లాట్ ఫామ్స్ ను 50 రోజుల చొప్పున మొత్తం వంద రోజుల పాటు మూసేయనున్నారు. తర్వాత ప్లాట్ ఫామ్ నవంబర్ 10వైపు పనులు చేపడతారు. మామూళ్ల సమయాల్లోనూ నిత్యం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీగా ఉంటుంది. ఇప్పటికే ఆరు జతల రైళ్లను తాత్కాలిక పద్దతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 115 రోజుల పాటు సింహభాగం ప్లాట్ ఫామ్స్ ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ లో రైల్వే సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. మొత్తంగా వచ్చే ఆర్నెళ్లు రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది.
కాచిగూడ నుంచి తుంగభద్రత ఎక్స్ ప్రెస్..
సికింద్రాబాద్ నుంచి ఏపీలోని కర్నూలుకు వెళ్లే తుంగభద్ర ఎక్స్ ప్రెస్ ను ఈనెల 10వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కాచిగూడ స్టేషన్ నుంచి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. ప్రతీరోజూ ఉదయం 7.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి మలక్ పేట, ఫటక్ నూమా, బుద్వేల్ మీదుగా కర్నూలుకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుందని, కర్నూలులో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.