CPI Narayana: జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో బట్టబయలైంది: ‘సీపీఐ’ నారాయణ

వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని నారాయణ ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

CPI Narayana: జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో బట్టబయలైంది: ‘సీపీఐ’ నారాయణ

Cpi Narayana

Updated On : March 30, 2023 / 5:32 PM IST

CPI Narayana: జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో బట్టబయలైందని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు.

కేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరిందని తెలిపారు. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నారని అన్నారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంతోనే వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.

కేంద్రాన్ని నిలదీసి పోలవరం బాధితులను ఆదుకోవాలని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ శ్మశానంలా మారుస్తున్నారని తెలిపారు. లండన్ నుంచి నీరవ్ మోదీ స్టేట్ మెంట్ ఇవ్వడం హాస్యాస్పదమని చెప్పారు. రాహుల్ గాంధీని లండన్ కోర్టుకు రప్పిస్తానని నీరవ్ మోదీ చెప్పడమేంటి? అని అన్నారు. మోదీకి ఆర్థిక నేరగాళ్లు సపోర్ట్ చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు.

రాహుల్ గాంధీని మోదీ రాజకీయ హత్య చేశారని తెలిపారు. ప్రజాకోర్టులో మోదీని దోషిగా నిలబెడతారని, ఘోరంగా ఓడిస్తారని అన్నారు. బీజేపీపై రాజకీయ పరమైన ఉద్యమం అవసరమని చెప్పారు. దేశ్ కా బచావో-మోదీ హఠావో అన్న నినాదంతో ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 15వతేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

KTR: ఈ పెట్రో ధరల భారం తగ్గాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది: కేటీఆర్