One Crore Insurance: కోటి రూపాయల ఇన్సూరెన్స్- ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పైనా లేదా ఆయా సంస్థలపైన కానీ ఒక్క రూపాయి కూడా భారం లేకుండా చూస్తున్నాం. One Crore Insurance

One Crore Insurance: కోటి రూపాయల ఇన్సూరెన్స్- ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Mallu Bhatti Vikramarka

Updated On : January 6, 2026 / 7:29 PM IST
  • సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెనస్
  • విద్యుత్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా
  • భవిష్యత్తుల్లో ఉద్యోగులందరికీ వర్తింపజేస్తాం
  • కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తాం

One Crore Insurance: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల భద్రతకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఉద్యోగులందరికీ కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తామంది. ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోటి రూపాయల ఇన్సూరెన్స్ గురించి కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం సింగరేణి కార్మికులకు, విద్యుత్ శాఖలోని అన్ని డిస్కమ్స్‌లో పని చేస్తున్న కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా (వన్ క్రోర్ ఇన్సూరెన్స్) సౌకర్యాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ వర్తింపజేసే ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టిందని, కొద్ది రోజుల్లో అది కూడా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. బ్యాంకుల ద్వారానే ఈ బీమా అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా ప్రభుత్వం లేదా ఆయా సంస్థలపై ఒక్క రూపాయి భారం లేకుండా చూస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ప్రస్తుతం సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులకు ఇన్సూరెన్స్..

”ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తాం. రాష్ట్రంలోని అన్ని శాఖల సిబ్బందికి వన్ క్రోర్ ఇన్సూరెన్స్ (కోటి రూపాయల ప్రమాద బీమా) కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులతో ప్రారంభమైన ఈ భారీ బీమా పథకాన్ని.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు వర్తింపజేస్తాం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల నడుమ సింగరేణి సంస్థ మనుగడ కాపాడుకోవటమే ఈ ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం.

బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా..

కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తాం. సింగరేణి ఉద్యోగుల సంక్షేమం విషయంలో మేము రాజీపడము. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి సింగరేణి ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.

రాష్ట్ర ప్రభుత్వంపైన కానీ సింగరేణి యాజమాన్యంపైన కానీ ఒక్క రూపాయి కూడా భారం లేకుండా బ్యాంకుల ద్వారానే ఇన్సూరెన్స్ కల్పిస్తాం. బ్యాంకుల ద్వారానే లావాదేవీలన్నీ చేస్తున్నాం. సింగరేణిలో ప్రమాదవశాత్తు కార్మికులకు ఏదైనా జరిగితే బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కోటి రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా మొట్టమొదటి సారిగా ఈ ప్రజా ప్రభుత్వం వచ్చాకే చేశాం. సింగరేణి కార్మికులతో పాటు విద్యుత్ ఉద్యోగులకు కూడా ఈ బీమా సౌకర్యాన్ని చేస్తున్నాం. ప్రతి ఉద్యోగి భద్రతా హక్కును కాపాడే ప్రజా ప్రభుత్వంగా, త్వరలోనే అన్ని శాఖల ఉద్యోగులకు ఇలాంటి బీమా సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read: తెలంగాణలోని రైతులకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక అంబులెన్సులు.. ఈ యాసంగి సాగుకు ఆ కష్టం తీరినట్లే..!