Vaccine Shortage: రెండో డోసు వారికే వ్యాక్సిన్.. అసలు సమస్య ఇదే
ఒకవేళ కేటాయింపులు పెంచితే అప్పుడు డోసుల లభ్యతను బట్టి అర్హులకు టీకాలను అందజేస్తారు...

Vaccine Shortage
Vaccine Shortage: కొవిడ్ కొరతను దృష్టిలో పెట్టుకుని రెండో డోసు వేసుకోవాల్సిన వారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం.. కొవీషీల్డ్ వేయించుకొని 6 వారాలు గడిచినవారికి.. కొవాగ్జిన్ తీసుకొని 4 వారాలు నిండినవారికి టీకాలను వేస్తారు. పరిస్థితి తీవ్రతను, వ్యాక్సిన్ లభ్యతను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.
శనివారం నుంచి రెండో డోసు టీకాలను పొందడానికి అర్హులైన వారందరూ స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా నేరుగా సమీపంలోని గవర్నమెంట్ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు. మొదటి డోసు వారికి ప్రస్తుతానికి టీకాల్లేవు.
‘మే 15 వరకు ఎవరికీ స్లాట్ బుకింగ్ ఉండదు. తర్వాత పరిస్థితుల్ని బట్టి నిర్ణయిస్తాం. మొదటి, రెండో డోసులకు సంబంధించి అన్ని స్లాట్ బుకింగ్‌లను రద్దు చేశాం. ఆ మేరకు బుక్ చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్‌లు పంపించాం. రెండో డోసు వారు మాత్రం స్లాట్‌ల రద్దుతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రానికి వచ్చి టీకా పొందవచ్చు’ అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం కోటిలోని ఆరోగ్య కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో మే31 నాటికి రెండో డోసు తీసుకోవాల్సిన వారు 19లక్షల 92వేల 257 మంది ఉన్నారు. ఇందులో కొవీషీల్డ్ పొందాల్సిన వారు 16లక్షల 61వేల 543 మంది కాగా, కొవాగ్జిన్ తీసుకోవాల్సిన వారు 3లక్షల 30వేల 714 మంది. కనీసం మే 15 నాటికి రెండో డోసు పొందాల్సిన వారి గణాంకాలను పరిశీలించినా.. 4లక్షల 99వేల 432 మందిగా ఉన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత టీకా నిల్వలు 3లక్షల 74వేల 900 డోసులు మాత్రమే ఉన్నాయి. అప్పటిదాకా రెండో డోసు వారికే టీకాలు ఇస్తారు. మొదటి డోసు వారికి ఇవ్వరు. మే 15 నాటికి మరో 3లక్షల 11వేల టీకా డోసులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో మే నెలాఖరు వరకూ రెండో డోసు వారికే టీకాలు సరిపోని స్థితి నెలకొంది. ఇలాంటప్పుడు మొదటి డోసు టీకాల పంపిణీ సాధ్యం కాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతానికి రెండో డోసు వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రోజుకు 2 లక్షల నుంచి 2.5 లక్షల డోసులు కేటాయించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రిని కోరారు. ఒకవేళ కేటాయింపులు పెంచితే అప్పుడు డోసుల లభ్యతను బట్టి అర్హులకు టీకాలను అందజేస్తారు. అప్పటి వరకూ 18-44 ఏళ్ల మధ్య వయస్కులు కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడున్న కొవిన్ పోర్టల్‌లో ప్రత్యేకంగా రెండోడోసు వారు మాత్రమే నమోదు చేసుకోవడానికి వీల్లేకుండా ఉంది.
ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. టీకాల కొనుగోలుకు ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.2వేల 500 కోట్లను మంజూరు చేసినా వ్యాక్సిన్ లభ్యత కొరతగానే ఉంది.