టీ-బీజేపీ పగ్గాలు ఎవరికి? తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుతోందా?

ఇలాంటి పరిస్థితుల్లో టీ-బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి?

టీ-బీజేపీ పగ్గాలు ఎవరికి? తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుతోందా?

Updated On : May 12, 2025 / 10:06 PM IST

పహల్గాం ఘటనతో బీజేపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? కేంద్రంలోనే కాదు..ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కమలంలో లెక్కలు మారుతున్నాయా? ఉగ్రదాడి ఘటన తర్వాత టీ-బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది బీజేపీ వర్గాల నుంచి. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెట్టబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. న్యూ పొలిటికల్ సినారియోతో పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు? కొత్తగా తెరపైకి వచ్చిన ఆ నేతలెవరు?

పహాల్గాం ఘటన బీజేపీలో పెను మార్పులకు కారణం కాబోతుందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతుంటే..టీ-బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపైనే చర్చ సాగుతోందంట. కొత్త అధ్యక్షుడి రాకతోనే పార్టీ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయన్న టాక్ విన్పిస్తోంది. ఎందుకంటే ఆపరేషన్ సిందూర్ బీజేపీని దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగేలా చేసిందంటూ పార్టీ కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: త్యాగదనులకు కీలకపదవులు దక్కేనా? నామినేటెడ్ పదవుల జాతర

ఇటు తెలంగాణలోనూ ఎప్పుడూ లేనంత మైలేజ్ పార్టీతో పాటు ప్రధాని మోదీకి వచ్చిందని వచ్చిందన్న చర్చ పార్టీ క్యాడర్లో విన్పిస్తోంది. పాకిస్తాన్ పై యుద్దం అంటే బీజేపీకే సాధ్యం..అనే తరహాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ మైలేజ్ ని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోందట. ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లే సరైన నాయకుడి కోసం అన్వేశిస్తున్నట్టుగా లేటెస్టుగా పార్టీలో ప్రచారం నడుస్తోంది. పహల్గాం ఘటనతో భిన్న ఆలోచనకు పార్టీవర్గాలు వచ్చినట్టుగా కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పెహల్గాంకు ముందు..ఆ తరువాత అనే రకంగా దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్ర దాడి ఘటన తరువాత దేశంలో పెనుమార్పులు జరిగాయన్న చర్చ నడుస్తోంది. హిందూ వర్సెస్ ముస్లీంగా పరిస్థితులు మారాయా అన్నట్లుగా అనిపిస్తున్నాయట. ఇలాంటి సిచువేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందన్న చర్చ సైతం రాష్ట్ర బీజేపీలో డిస్కషన్ జరుగుతోందట.

వీరికి అప్పగిస్తే బెటర్?
ఈ పొలిటికల్ సినారియోను ప్రజా వేదికలపైన ప్రస్తావించే నాయకుడైతే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి బీజేపీ హిందూ ముస్లీం అంటూ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు పార్టీపై ఎలాగూ ఉన్నాయని…గతంలో బండి సంజయ్ సైతం మసీదులను తవ్వితే శివం వస్తే మాకు, శవం వస్తే మీకు అంటూ హాట్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.

నిన్నా మొన్నటి వరకు ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫాం అయ్యిందని..ఇతర నాయకులందర్నీ ఒప్పించేందుకే ఆలస్యం జరుగుతుందన్న చర్చ పార్టీలో సాగింది. కానీ దేశంలో ఇటు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్ధితులకు అనుగుణంగా కరడుగట్టిన బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ మళ్లీ మొదలైందట. పెహల్గామ్ దుర్ఘటన, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకొనివెళ్ళే వ్యక్తికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందనే వాదన ఈటల వ్యతిరేకవర్గీయులు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టీ-బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీ-బీజేపీ పగ్గాలు చేపట్టేది ఎవరనేది రానునన రోజుల్లో తేలిపోనుంది.