Mahesh Goud: మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల పనితీరుపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Mahesh Goud: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయింది. అదిగో ఇదిగో అంటున్నారు కానీ, మంత్రివర్గాన్ని విస్తరించింది లేదు. క్యాబినెట్ విస్తరణకు ఎన్నో ముహూర్తాలు పెట్టారు, అవన్నీ దాటిపోయాయి. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ అంటూ వాపోతున్నారు.
ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై పీపీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాదు ఇదే నెలలో పీసీసీ కార్యవర్గం కూడా పూర్తవుతుందన్నారు. ఇక, ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని సూచించారు. మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్నారు. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
Also Read: కవితే చెప్పింది.. అది బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్.. దెయ్యాల రాష్ట్ర సమితి- సీఎం రేవంత్ ఫైర్
పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమే అన్నారు. సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలని, పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని చెప్పారు. వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. పార్టీ సమర్ధవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.