మోడీ వీడియో కాన్ఫరెన్స్ : లాక్‌డౌన్‌ పొడిగింపుకే జై కొట్టిన మెజార్టీ సీఎంలు

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 04:43 AM IST
మోడీ వీడియో కాన్ఫరెన్స్ : లాక్‌డౌన్‌ పొడిగింపుకే జై కొట్టిన మెజార్టీ సీఎంలు

Updated On : June 26, 2020 / 8:41 PM IST

ప్రధాని నరేంద్రమోదీ కరోనా నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 2020, మే 11వ తేదీ సోమవారం ఈ కాన్పరెన్స్ జరిగింది. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్‌ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై  ప్రధాని మోదీ… సీఎంల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఆరు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలి, కరోనాతో ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్‌ వ్యూహాన్ని ఎలా రూపొందించుకోవాలన్న దానిపై సీఎంలకు ప్రధాని వివరించారు. 

ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామన్నారు. కరోనా మహమ్మారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందన్న ప్రధాని.. ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయన్నారు. ఎక్కడైతే భౌతికదూరం నియమాలు పాటించలేదో.. ఆయా చోట్ల సమస్యలు పెరిగాయన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాలకు మినహాయింపులు ఇచ్చినా.. కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతిపెద్ద సవాలని అన్నారు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. లాక్‌డౌన్‌ను పొడిగించాలని వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రధానికి సూచించారు. మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగింపుకే జైకొట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదన్నారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తేనే వైరస్‌ను అదుపుచేయగలమని తెలిపారు. 

వాస్తవానికి ఇప్పుడు కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ ఈనెల 17న ముగియనుంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సీఎంలను లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధాని మోదీకి సూచించారు. దీంతో కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈనెల 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది.

పంజాబ్‌, మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశముంది.  దీనిపై, 2020, మే 12వ తేదీ, మే 13వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ పొడిగింపును గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వ్యతిరేకించారు. లాక్‌డౌన్‌ను కేవలం కంటైన్‌మెంట్‌ జోన్లకే పరిమితం చేయాలని, అక్కడ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. దీర్ఘకాల ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించకుండా మనుగడ సాగించడం కష్టమని తేల్చిచెప్పారు. 

Read More:

ఇకపై అతిపెద్ద సవాల్ అదే…సీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ లో మోడీ

మోడీ ఎదురుగానే కేంద్రం తీరుపై మమత ఫైర్