దారుణం.. తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. ఆ యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేశాడు..
వెంకట రమణను చంపేందుకు ప్లాన్ వేసుకుని, తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి 12.20 గంటలకు వచ్చాడు.

ఓ అమ్మాయిని చాలా కాలంగా ఓ యువకుడు వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే, అందుకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరో యువకుడికి ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి జరిపించారు. దీంతో ఆ అమ్మాయి భర్తను దారుణంగా హత్య చేశాడు యువకుడు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని అడవిపూడి గ్రామానికి చెందిన జగదీశ్ అనే యువకుడు అతడి సోదరుడు దుర్గా ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని సర్దార్ పటేల్ నగర్‌లో ఉంటున్నాడు.
వారి బంధువు కె.వెంకటరమణ భగత్ సింగ్ నగర్‌లో ఉంటాడు. దుర్గాప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కాచెల్లెళ్లు. దీంతో ఆయా ఫ్యామిలీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దుర్గాప్రసాద్ మరదలు శ్రావణి సంధ్య వీరిలోనే నివసిస్తోంది.
అడవిపూడికి చెందిన మరో యువకుడు పవన్ కుమార్ సర్ధార్ పటేల్ నగర్‌లోనే ఉంటున్నాడు. అతడు ఆటోడ్రైవర్. శ్రావణి సంధ్యను చాలా కాలంగా ఇష్టపడుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, కొన్ని ఏళ్ల క్రితం ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. అయితే, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. తమ కాలనీలోనే ఉండే కె.వెంకట రమణకు సంధ్యను ఇచ్చి వివాహం జరిపించారు.
ఈ నేపథ్యంలో పవన్ కుమార్ పదేపదే వెంకట రమణ, అతడి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. వెంకట రమణను చంపేందుకు ప్లాన్ వేసుకుని, తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి 12.20 గంటలకు వచ్చాడు. పవన్ కుమార్ తన మరో నలుగురు స్నేహితులతో కలిసి వెంకట రమణపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. వెంకట రమణ అక్కడికక్కడే మృతి చెందాడు.