Gold thefts : మీ దగ్గర బంగారం, వెండి ఉందా..? అయితే, తస్మాత్ జాగ్రత్త.. హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

Gold : బంగారం, వెండి ధరలు అమాంతం పెరగటంతో దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో నగర ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు.

Gold thefts : మీ దగ్గర బంగారం, వెండి ఉందా..? అయితే, తస్మాత్ జాగ్రత్త.. హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

Gold thefts

Updated On : October 15, 2025 / 12:53 PM IST

Gold thefts : బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1.25లక్షలకు చేరగా.. కిలో వెండి రేటు రూ.2లక్షలు దాటేసింది. ఊహించని స్థాయిలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో దొంగలుసైతం రెచ్చిపోతున్నారు.

బంగారం, వెండి ధరలు అమాంతం పెరగటంతో గోల్డ్ దొంగతనాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వరుసగా బంగారం, వెండి ఆభరణాలు చోరి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంపల్లి, దోమలగూడ, హయత్ నగర్, జవహర్ నగర్, ఇబ్రహీంపట్నం, తార్నాకలో గోల్డ్, సిల్వర్ చోరీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో 10 కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

Also Read: Gold Price Today : గోల్డ్ ప్రియుల కొంపముంచిన ట్రంప్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కారణాలు ఇవే.. ఇంకెన్నాళ్లు..?

హయత్‌నగర్ పెద్ద అంబర్ పేటలో ఏకంగా విల్లాలో దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న విల్లాలకు వెళ్ళి సెంట్రల్ లాక్ డోర్లను బద్దలుకొట్టి 35 గ్రాముల బంగారం, ఐదు కిలోల వెండిని దొంగలు చోరీ చేశారు. అదేవిధంగా.. ముషీరాబాద్ దోమలగూడలో కేర్ టేకర్ వృద్ధ దంపతులపై దాడిచేసి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

జవహర్ నగర్ దమ్మాయిగూడలో ఊరెళ్లి తిరిగి వచ్చేసరికి మూడు తులాల బంగారం, ఏడు తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇబ్రహీంపట్నంలో రవీందర్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లి వచ్చి చూసేసరికి 10 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

జీడిమెట్ల కొంపల్లిలో ఇనుప రాడ్లు, వేటు కొడవళ్లతో దుండగలు చోరీకి వెళ్లారు. ఓ ఇంట్లో ఆభరణాలు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. జీడిమెట్ల దేవేందర్ నగర్‌లో మరో ఇంట్లో కిలో వెండిని దొంగలు చోరీ చేశారు. కొద్దిరోజుల క్రితం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 43 తులాల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు.

చందానగర్‌లో రిటైర్డ్ బిహెచ్ఇయల్ ఉద్యోగి ఇంటికి తాళం పగలగొట్టి 17 తులాల బంగారంతో పాటు 60 తులాల వెండి ఆభరణాలతో దొంగలు పరారయ్యారు. నగరంలో గోల్డ్, వెండికోసం వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులు సూచించారు.